రేపటి నుంచి వరుసగా శుభ ఘడియలు
శుభ కార్యాలంటే (Functions)నే శ్రావణ మాసం(Shravana Masam Season).. శ్రావణ మాసమంటేనే శుభకార్యాలు. శుక్రవారం నుంచి శుభాకార్యాల మాసం ప్రారంభం కానుండడటంతో తమ పిల్లలకు పిల్లల వివాహం (Marriages) చేయాలనుకుంటున్న తల్లిదండ్రులు ముహూర్తాలు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. నిన్నటి వరకు ఆషాఢ మాసం కావడంతో నెలన్నర రోజులు గిరాకీ లేక శుభకార్యాలపై ఆధారపడి వ్యాపారాలు నిర్వహించేవారు పనిలేక ఇబ్బంది పడ్డారు.
ఇక ముహూర్తాలు ప్రారంభం కావడంతో ఆనందంగా ఉన్నారు. శ్రావణ మాసం నేపథ్యంలో తెలంగాణవ్యాప్తంగా ఉన్న డెకరేషన్ (Decoration), ఫొటోగ్రఫీ (Photography), ఈవెంట్లు (Events Management), కేటరింగ్‌తో పాటు జ్యూవెలరీ, వస్త్ర, కిరాణ వ్యాపార సముదాయాలు కిటకిటలాడనున్నాయి. కల్యాణ మండపాల వద్ద పెళ్లి బృందాల సందడి మొదలుకానున్నది. జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మూడు ముళ్లతో అధిక సంఖ్యలో నవ జంటలు ఒక్కటి కానున్నాయి.
ఇందుకు అనుగుణంగా యువతీ యువకుల తల్లిదండ్రులు ముందస్తు పెళ్లి పనుల్లో బిజీబిజీగా ఉంటున్నారు. నగరాలు, పట్టణాల్లోని కల్యాణ మండపాలు ఇక వివాహ వేడుకలతో కళకళలాడనున్నాయి. వివాహానికి యోగ్యమైన ముహూర్తాలను పురోహితులు సూచిస్తున్నారు. శ్రావణ మాసం సందర్భంగా ఈనెల 26వ తేదీ, 27, 30, 31 తేదీల్లో పలు ముహూర్తాలు ఉన్నట్లు చెప్తున్నారు.
అలా ఆగస్టు నెలలో 3, 5, 7, 8, 10, 11, 14, 15, 17, 18వ తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. అలాగే భూమిపూజలు, శంకుస్థాపన, గృహ ప్రవేశాల, కేశఖండనాలు, ప్రతిష్ఠాపనల నిర్వాహకులు పురోహితులను సంప్రదించి ముహూర్తాలను నిర్ణయించుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక పూజలు, పండగలను భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. నాగుల పంచమి, వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి,
వినాయక చవితి పండగలతో ఆలయాల్లో పాటు ప్రధాన వీధులు, గృహాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్నాయి. ఈ ముహూర్తాలు వెళితే మళ్లీ ఆశ్వయుజ, కార్తీక మాసాలు అంటే…అక్టోబర్ 4వ తేదీ, 8, 16, 24, 31, నవంబరు 1వ తేదీ, 7, 22, 23, 25, 26, 29 తేదీల్లో శుభకార్యాలు నిర్వహించుకోవడానికి వీలుగా ముహూర్తాలున్నాయి.