Japan Tour: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) తన పదవీకాలం చివరిలో మాటల తడబాటుతో, తప్పుల ప్రవర్తనతో సోషల్ మీడియాలో మీమ్స్‌కు కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కూడా ఇంటర్నెట్ వినియోగదారుల విమర్శలపాలవుతున్నారు. జపాన్ పర్యటనలో అధికారిక కార్యక్రమం సందర్భంగా ట్రంప్ ప్రవర్తన చర్చనీయాంశమైంది. ఆయన చేసిన చర్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా మంగళవారం ట్రంప్ జపాన్(Japan) రాజధాని టోక్యో(Tokyo) చేరుకున్నారు. అక్కడ కొత్తగా పదవిలోకి వచ్చిన ప్రధానమంత్రి సనే టకాయిచి ఆయనకు సైనిక గౌరవ వందనంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఆ వీడియోలో ట్రంప్ సైనిక గౌరవ వందనం స్వీకరిస్తున్నప్పుడు తొలుత సెల్యూట్ చేయబోయి, వెంటనే చేయి దించేశారు. ఇది ప్రోటోకాల్ ఉల్లంఘనగా భావించి తాము సరిచేసుకున్నారో లేదో కానీ, ఆ క్షణం ప్రేక్షకులను అయోమయానికి గురిచేసింది.
ఆ తరువాత జపాన్ ప్రధాని టకాయిచితో కలిసి నడుస్తున్న సమయంలో కూడా ట్రంప్ ఒక చిన్న పొరపాటు చేశారు. ప్రధానమంత్రి ఆగాలని సూచించినప్పటికీ, ట్రంప్ ఆ సంకేతాన్ని పట్టించుకోకుండా ముందుకు నడిచిపోతూ కనిపించారు. దీంతో టకాయిచి కాసేపు ఆశ్చర్యపోయి నిల్చిపోయారు. చివరికి వేగంగా నడిచి ట్రంప్ వద్దకు చేరుకుని, ఆయనను తిరిగి ప్రోటోకాల్ ప్రకారం వేదిక వైపు తీసుకెళ్లారు. తర్వాత వేదిక దారిని చూపిస్తూ ఒక సైనికాధికారి సైగ చేసినా, ట్రంప్ దానిని కూడా పట్టించుకోకుండా నిదానంగా ముందుకు సాగిపోయారు. వాస్తవానికి ఆయన 90 డిగ్రీల కోణంలో వేదిక వైపు తిరగాల్సి ఉండగా, దిశ తప్పి వెళ్లిపోయారు. చివరికి జపాన్ ప్రధాని మళ్లీ మార్గదర్శనం చేయడంతో ఇరు దేశాల జాతీయ గీతాలు ఆలపించే వేదిక వద్దకు చేరుకున్నారు.
ఈ సంఘటనతో సోషల్ మీడియాలో ట్రంప్ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “దేశాధినేతగా ప్రోటోకాల్ కూడా తెలియదా?”, “ఇది మరో బైడెన్ సన్నివేశమా?” అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇక, ట్రంప్ మానసిక ఆరోగ్యం గురించిన చర్చలు మళ్లీ చెలరేగాయి. గతంలో ఆయన ప్రపంచ నాయకుల పేర్లు, దేశాల పేర్లు గందరగోళానికి గురి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకసారి భారత్–పాకిస్థాన్ అణుయుద్ధం గురించి మాట్లాడేటప్పుడు పొరపాటున భారత్ స్థానంలో ఇరాన్ అని పేర్కొన్నారు. మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ జాన్ గార్ట్‌నర్ ఇటీవల ట్రంప్ నడక, కదలికల్లో మార్పులు కనిపిస్తున్నాయని, ఇవి డిమెన్షియా (మతిమరుపు) ప్రారంభ లక్షణాలు కావచ్చని అభిప్రాయపడ్డారు. అయితే, ఈ ఆరోపణలను వైట్‌హౌస్ వర్గాలు ఖండించాయి. అధ్యక్షుడు పూర్తిగా ఆరోగ్యవంతుడని, ఆయనకు ఎటువంటి మతిమరుపు లక్షణాలు లేవని అధికార ప్రతినిధులు స్పష్టం చేశారు.
Did Donald Trump salute Japan’s Flag?
TF…🤨
pic.twitter.com/t89Y13aKeI— Jeremy H🇺🇸 (@jeremyfromga) October 28, 2025
