end
=
Thursday, November 6, 2025
వార్తలుఅంతర్జాతీయంఅమెరికాలో భారత సంతతి జోరు.. న్యూయార్క్‌ మేయర్‌గా జోహ్రాన్‌ మమ్దానీ విజయం
- Advertisment -

అమెరికాలో భారత సంతతి జోరు.. న్యూయార్క్‌ మేయర్‌గా జోహ్రాన్‌ మమ్దానీ విజయం

- Advertisment -
- Advertisment -

America : అమెరికా స్థానిక ఎన్నికల్లో (US local elections)వచ్చిన తాజా ఫలితాలు అధికార రిపబ్లికన్ పార్టీకే కాకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కూ పెద్ద షాకుగా మారాయి. న్యూయార్క్ నగర మేయర్ (New York City)ఎన్నికలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జొహ్రాన్ మమ్‌దానీ (Zohran Mamdani) ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించారు. కేవలం 34 ఏళ్ల వయసులోనే ఈ ప్రతిష్ఠాత్మక పదవిని గెలుచుకున్న ఆయన, న్యూయార్క్ నగర చరిత్రలోనే అత్యంత పిన్న వయస్క మేయర్‌గా నిలిచారు. భారతీయ మరియు ఉగాండ మూలాలున్న జొహ్రాన్ మమ్‌దానీ ప్రముఖ భారతీయ సినీ దర్శకురాలు మీరా నాయర్ మరియు ఉగాండాకు చెందిన ఆర్థికవేత్త మహమూద్ మమ్‌దానీ కుమారుడు కావడం విశేషం. వలసదారుల కుటుంబంలో జన్మించిన జొహ్రాన్ చిన్ననాటి నుంచే సామాజిక న్యాయం, సమానత్వం పట్ల ఆసక్తి చూపారు. ఆయన సోషలిస్టు భావజాలం కలిగిన నేతగా గుర్తింపు పొందారు.

ఈ ఎన్నికలు ట్రంప్‌కు వ్యక్తిగతంగా ప్రతిష్ఠాత్మకంగా మారాయి. మమ్‌దానీని కమ్యూనిస్టు భావజాలం కలిగిన ప్రమాదకర అభ్యర్థి గా అభివర్ణించిన ట్రంప్, ఎన్నికలకు కొన్ని గంటల ముందు సోషల్ మీడియాలో మమ్‌దానీ గెలిస్తే న్యూయార్క్‌కు నిధులు తగ్గిస్తా అని హెచ్చరించారు. అయితే ఈ వ్యాఖ్యలన్నింటినీ పట్టించుకోకుండా, మమ్‌దానీ తన పాజిటివ్ ప్రచారంతో ప్రజల మన్ననలు పొందారు. మమ్‌దానీ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రజలకు ఆకర్షణీయమైన పలు హామీలు ఇచ్చారు. నగర ప్రజల దైనందిన ప్రయాణాలకు ఉచిత సిటీ బస్సు సేవలను అందిస్తానని, అద్దె ధరలను నియంత్రించే విధానాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చారు. అదనంగా, యూనివర్శల్ చైల్డ్ స్కీమ్ అమలు, 2030 నాటికి కనీస వేతనాల పెంపు, అలాగే కార్పొరేట్ సంస్థలు మరియు సంపన్నులపై అధిక పన్నులు విధించి తక్కువ ఆదాయం కలిగిన వర్గాలకు సహాయం చేస్తానని ప్రకటించారు. ఈ హామీలు యువత, మధ్యతరగతి మరియు వలసదారుల వర్గాలను బలంగా ఆకర్షించాయి.

ముఖ్యంగా ట్రంప్ విధానాలకు స్పష్టమైన ప్రతిఘటన చూపిన మమ్‌దానీ న్యూయార్క్ అనేది వైవిధ్యానికి, సమానత్వానికి ప్రతీక అని పేర్కొంటూ తన ప్రచారాన్ని ముందుకు నడిపారు. ఫలితంగా, న్యూయార్క్ ప్రజలు ఆయనకు ఘన విజయం అందించారు. జొహ్రాన్ మమ్‌దానీ విజయం కేవలం ఒక రాజకీయ గెలుపు మాత్రమే కాదు, అమెరికాలో వలసదారుల సంతతి కొత్త తరం రాజకీయ నాయకుల ఎదుగుదలకు ఒక ప్రతీకగా మారింది. ఈ ఫలితంతో అమెరికా రాజకీయ సమీకరణాలపై డెమోక్రటిక్ పార్టీకి కొత్త ఉత్సాహం లభించగా, రిపబ్లికన్ పార్టీ ఆత్మపరిశీలన లో పడింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -