Mumbai : ప్రముఖ నటి శిల్పా శెట్టి (Actress Shilpa Shetty) మరియు ఆమె భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రా (Raj Kundra)పేర్లు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేర మోసం చేసిన కేసు విచారణ కీలక దశలోకి అడుగుపెట్టింది. నిధుల మళ్లింపులో పాల్గొన్న నలుగురు కీలక వ్యక్తులను ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ (ED) గుర్తించి, వారిని విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసినట్లు సమాచారం. దర్యాప్తు బృందం తెలిపిన వివరాల ప్రకారం, ఈ నలుగురు వ్యక్తులు రాజ్ కుంద్రా నిర్వహిస్తున్న కంపెనీలో ఉన్నత హోదాల్లో పనిచేస్తున్నవారుగా గుర్తించారు. వీరిలో ఒకరు ఇప్పటికే విచారణకు హాజరై వివరాలు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కంపెనీకి వచ్చిన నిధులు వ్యాపార లావాదేవీలకే వినియోగించారా? లేక వాటిని ఇతర వ్యక్తిగత అవసరాలకు మళ్లించారా? అనే అంశంపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
దీపక్ కొఠారి అనే వ్యాపారవేత్త ఫిర్యాదు మేరకు జుహు పోలీసులు గత ఆగస్టు 14న శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలపై మోసం, నిధుల దుర్వినియోగం ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ఒప్పంద ప్రకారం పెట్టుబడి చేసిన రూ.60 కోట్లు తిరిగి ఇవ్వకుండా, వేరే కంపెనీలకు బదిలీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే రాజ్ కుంద్రాను అధికారులు ఐదు గంటలపాటు విచారించి పలు కీలక పత్రాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఆయన తెలిపిన వివరాలను పరిశీలిస్తున్న ED అధికారులు, డబ్బు ప్రవాహాన్ని గుర్తించేందుకు బ్యాంకు లావాదేవీలను విశ్లేషిస్తున్నారు.
ఇదే సమయంలో, దర్యాప్తు కొనసాగుతుండగానే శిల్పా శెట్టి రాజ్ కుంద్రా తరచుగా విదేశీ పర్యటనలకు వెళ్తున్నారనే సమాచారంతో అధికారులు లుకౌట్ నోటీసులు (Look Out Circulars) జారీ చేశారు. విచారణలో ఆటంకం కలగకుండా ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇక, ఈ కేసు దర్యాప్తు మరింత విస్తరించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. నిధుల మళ్లింపు వెనుక ఉన్న అసలు వ్యక్తులు, వాటి గమ్యం వంటి అంశాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా ఇప్పటివరకు ఈ ఆరోపణలపై స్పందించకపోయినా, వారి న్యాయవాదులు త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు బాలీవుడ్‌లో మరో పెద్ద సంచలనంగా మారింది.
