ఇస్రో మరో చారిత్రక ఘట్టం: నింగిలోకి దూసుకెళ్లిన ‘బ్లూ బర్డ్‌ బ్లాక్‌-2’

9
Another historic moment for ISRO: 'Blue Bird Block-2' launches into space
Another historic moment for ISRO: 'Blue Bird Block-2' launches into space
- Advertisement -

ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)(ISRO) మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. తన అత్యంత శక్తివంతమైన రాకెట్‌ ‘బాహుబలి’గా పేరుగాంచిన LVM3-M6 ద్వారా అమెరికాకు చెందిన అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్–6 (BlueBird 6) ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం ఉదయం జరిగిన ఈ ప్రయోగం, భారత అంతరిక్ష రంగ చరిత్రలోనే అతిపెద్ద వాణిజ్య విజయంగా నిలిచింది. ఉదయం 8:55 గంటల సమయంలో రెండో లాంచ్ ప్యాడ్ నుంచి 43.5 మీటర్ల ఎత్తైన LVM3 రాకెట్ ఉరుముల శబ్దాలతో నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగం ప్రారంభమైన కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే, భూమికి సుమారు 520 కిలోమీటర్ల ఎత్తులో బ్లూబర్డ్–6 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ఖచ్చితంగా ప్రవేశపెట్టింది.

- Advertisement -

6,100 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం, భారత గడ్డపై నుంచి ప్రయోగించిన అత్యంత భారీ వాణిజ్య ఉపగ్రహంగా కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ ఘనతతో LVM3 రాకెట్ సామర్థ్యం మరోసారి ప్రపంచానికి చాటింది. అమెరికాకు చెందిన AST SpaceMobile సంస్థ రూపొందించిన బ్లూబర్డ్–6 ఉపగ్రహం ప్రత్యేకత చాలా విశేషమైనది. ఎలాంటి అదనపు పరికరాలు లేదా ప్రత్యేక యాంటెన్నాలు లేకుండానే, సాధారణ స్మార్ట్‌ఫోన్లకు నేరుగా అంతరిక్షం నుంచి 4G/5G బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించగలగడం దీని ప్రధాన లక్ష్యం. దీని ద్వారా మారుమూల ప్రాంతాలు, సముద్రాలు, అరణ్యాలు వంటి నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లోనూ మొబైల్ కమ్యూనికేషన్ సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది భవిష్యత్తు కమ్యూనికేషన్ రంగానికి గేమ్‌చేంజర్‌గా మారనుంది.

ఈ ప్రయోగంలో ఒక ఆసక్తికరమైన మలుపు చోటుచేసుకుంది. ముందుగా ఉదయం 8:54 గంటలకు ప్రయోగం జరగాల్సి ఉండగా, రాకెట్ ప్రయాణ మార్గంలో అంతరిక్ష వ్యర్థాలు లేదా ఇతర ఉపగ్రహాలతో ఢీకొనే అవకాశం ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన వారు, కచ్చితమైన సమయ పాలనతో ప్రయోగాన్ని 90 సెకన్ల పాటు వాయిదా వేశారు. చివరకు 8:55 గంటల 30 సెకన్లకు ప్రయోగం చేపట్టి, ప్రమాదాన్ని విజయంగా మలిచారు. ప్రయోగం అనంతరం ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ మాట్లాడుతూ, “LVM3 రాకెట్ తన అద్భుతమైన ట్రాక్ రికార్డును మరోసారి నిరూపించింది. ప్రపంచంలోనే అత్యుత్తమ రాకెట్లలో ఇది ఒకటని ఈ మిషన్ చాటింది” అని అన్నారు. ఇది ఇస్రో చేపట్టిన మూడవ పూర్తి స్థాయి వాణిజ్య మిషన్ కావడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -