end
=
Wednesday, October 29, 2025
వార్తలురాష్ట్రీయండీప్‌ఫేక్ మోసాలపై జాగ్రత్త ..‘సేఫ్ వర్డ్’తోనే రక్షణ : సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరిక
- Advertisment -

డీప్‌ఫేక్ మోసాలపై జాగ్రత్త ..‘సేఫ్ వర్డ్’తోనే రక్షణ : సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరిక

- Advertisment -
- Advertisment -

Hyderabad : వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ (Technology)ని నేరగాళ్లు కూడా తమ దురుద్దేశాలకు వాడుకోవడం ప్రారంభించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా రూపొందిస్తున్న డీప్‌ఫేక్ మోసాలు (Deepfake scams) ఇటీవల పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్(Police Commissioner VC Sajjanar) హెచ్చరించారు. మనకు తెలిసిన వ్యక్తుల ముఖం, గొంతు, మాట్లాడే తీరును ఏఐ సాయంతో సరిగ్గా అనుకరించి, మోసాలకు పాల్పడుతున్నారని ఆయన వివరించారు. డీప్‌ఫేక్ మోసం ఎలా జరుగుతుంది? సజ్జనార్ వివరాల ప్రకారం, సైబర్ నేరగాళ్లు సామాజిక మాధ్యమాల నుంచి మన కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల ఫోటోలు, వీడియోలు సేకరించి వాటిని ఏఐ సాయంతో క్లోన్ చేస్తున్నారు. తర్వాత ఆ డేటాను ఉపయోగించి మనకు వీడియో లేదా ఆడియో కాల్ చేస్తారు. వారు తాము ఏదో అత్యవసర పరిస్థితిలో ఉన్నామంటూ డబ్బు అడుగుతారు. వారి రూపం, స్వరం మనకు తెలిసిన వారి లాగానే ఉండటంతో చాలామంది మోసపోతున్నారు. ఈ మోసాల వలన దేశవ్యాప్తంగా కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని, ‘పై-ల్యాబ్స్’ నివేదిక ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి సుమారు ₹70,000 కోట్ల నష్టం సంభవించే అవకాశం ఉందని కమిషనర్ తెలిపారు.

రక్షణకు ‘సేఫ్ వర్డ్’ మార్గం

ఇలాంటి డీప్‌ఫేక్ మోసాల బారిన పడకుండా ఉండటానికి ‘సేఫ్ వర్డ్’ పద్ధతి ఉత్తమమని సజ్జనార్ సూచించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు ముందుగానే ఒక రహస్య పదం లేదా కోడ్‌ను నిర్ణయించుకోవాలి. ఎవరైనా అత్యవసరమంటూ డబ్బు అడిగితే, ముందుగా ఆ సేఫ్ వర్డ్ ఏమిటో అడగాలి. వారు సరైన పదం చెప్పలేకపోతే అది మోసమని గుర్తించవచ్చు. ఈ పద్ధతితో ఎన్నో మోసాలను అడ్డుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అప్రమత్తతే ఆయుధం సజ్జనార్ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేస్తూ తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్, సందేశాలు, లింకులను నమ్మొద్దని సూచించారు. కేవలం రూపం లేదా స్వరం చూసి నమ్మడం ప్రమాదకరం. డీప్‌ఫేక్ కాల్స్, వీడియోల వెనుక మోసగాళ్లు దాగి ఉంటారు అని హెచ్చరించారు. ఎవరికైనా ఇలాంటి మోసపు కాల్స్ వస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. టెక్నాలజీ వృద్ధి మానవ జీవితానికి సౌలభ్యం తెచ్చినప్పటికీ, అదే టెక్నాలజీ ఇప్పుడు మోసాలకు ఆయుధంగా మారిందని కమిషనర్ పేర్కొన్నారు. అప్రమత్తత, పరిశీలన, సేఫ్ వర్డ్ ఈ మూడు ఉంటేనే డీప్‌ఫేక్ మోసాల నుంచి మనం రక్షించుకోగలం అని ఆయన స్పష్టం చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -