Warangal: మొంథా తుఫాన్ (Montha Cyclone )ప్రభావంతో చారిత్రక నగరం వరంగల్ విపరీత వర్షాల బారిన పడింది. బుధవారం రోజంతా కుండపోత వర్షం (Heavy rain)కురవడంతో నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రధాన రహదారులు, వీధులు, కాలనీలు వరద నీటితో నిండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం తగ్గినా వరద ఉద్ధృతి మాత్రం తగ్గకపోవడంతో నగరవాసులు ఆందోళనలో ఉన్నారు.
45 కాలనీలు నీట మునిగిన పరిస్థితి
వరంగల్ నగరంలోని దాదాపు 45 కాలనీలు వరద ముప్పుకు గురయ్యాయి. ముఖ్యంగా సాయిగణేశ్ కాలనీ, సంతోషిమాత కాలనీ, డీకే నగర్, ఎన్‌ఎన్ నగర్, మైసయ్యనగర్ వంటి ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చొచ్చుకుపోవడంతో ప్రజలు గృహాలు విడిచి బయటకు రావలసి వచ్చింది. సుమారు 30 కాలనీలు పూర్తిగా బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. విద్యుత్, తాగునీరు, రవాణా వంటి మౌలిక సేవలు దెబ్బతిన్నాయి.
రక్షణ చర్యల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు
విపత్తు సమాచారం అందుకున్న వెంటనే ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, స్థానిక పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి. పడవల సాయంతో లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరంగల్ తూర్పు, హనుమకొండ ప్రాంతాల్లో కలిపి మొత్తం 12 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 1,200 మందికి పైగా బాధితులను ఈ కేంద్రాలకు తరలించినట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం తెలిపింది.
దెబ్బతిన్న రవాణా వ్యవస్థ
భారీ వర్షాల కారణంగా హంటర్‌రోడ్డులోని బొందివాగు పొంగిపొర్లుతూ రహదారి మీదుగా ప్రవహిస్తోంది. దీంతో వరంగల్–హనుమకొండ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ములుగు రహదారిపై కూడా నీటి మడుగులు ఏర్పడి వాహన చలనం నిలిచిపోయింది. పలు కాలనీల్లో కార్లు, బైక్‌లు జల ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. పోచమ్మ మైదాన్-దేశాయిపేటకు వెళ్లే మార్గంలో 80 ఫీట్ రోడ్డు కూడలి వద్ద ప్రమాదకరంగా గుంత ఏర్పడింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సహాయం కోసం వరంగల్ బల్దియా కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్ 1800–425–1980 ను సంప్రదించాలని అధికారులు సూచించారు. డీఆర్‌ఎఫ్, ఇంజినీరింగ్, శానిటరీ శాఖలకు చెందిన ఏడుగురు ప్రత్యేక బృందాలు నగరమంతా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.
విద్యాసంస్థలకు సెలవులు, పరీక్షల వాయిదా
వరద తీవ్రత దృష్ట్యా, ముందుజాగ్రత్త చర్యగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం గురువారం నుంచి సెలవులు ప్రకటించింది. పాఠశాలల్లో నిర్వహించాల్సిన ఎస్‌ఏ-1 పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) తెలిపారు. అధికారులు ప్రజలను జాగ్రత్తగా ఉండమని, అవసరమైతే సమీప పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. వరంగల్ వాసులు ఈ విపత్తు నుంచి తేరుకునే ప్రయత్నంలో ఉన్నారు. అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ, వరద ప్రభావం తగ్గే వరకు అప్రమత్తంగా ఉండమని సూచిస్తున్నారు.
