Rahul Gandhi: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(President Donald Trump) చేసిన తాజా వ్యాఖ్యలు భారత్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రష్యా నుంచి భారత్ (India) ఇకపై చమురు కొనుగోలు చేయదని ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)తీవ్రంగా స్పందించారు. ట్రంప్‌ను చూసి మోదీ భయపడ్డారని ఆయన ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ, “ట్రంప్ నిర్ణయాలు తీసుకొని ప్రకటించేందుకు మేము అనుమతిస్తున్నాం. పదేపదే అవమానకరమైన వ్యాఖ్యలు వచ్చినా, మేము శుభాకాంక్షలు చెప్పడమే. ఆర్థిక మంత్రి పర్యటనను రద్దు చేశాం. గాజా శాంతి ఒప్పంద సదస్సుకు మోదీ హాజరు కాలేదు. ఆపరేషన్ సిందూర్‌పై ట్రంప్ చేసే వ్యాఖ్యలకు కేంద్రం ఏ స్పందన ఇవ్వడం లేదు,” అంటూ విమర్శలు గుప్పించారు.
ట్రంప్ వ్యాఖ్యలతో పాటు, భారత్-అమెరికా మధ్య చమురు కొనుగోలు అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ గతంలో పేర్కొన్నట్లుగా, సరైన ధర దొరికితేనే అమెరికా నుంచి చమురు కొనుగోలు కొనసాగిస్తామని భారత్ స్పష్టం చేసింది. గత సంవత్సరాల్లో భారత్ అమెరికా నుంచి సుమారు 22-23 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనం కొనుగోలు చేసింది. ఈ సంవత్సరం ఆ సంఖ్యను 12-13 బిలియన్ డాలర్ల వరకు పెంచే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇప్పటికే భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చలు కొనసాగుతున్న సందర్భంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయన మాట్లాడుతూ, “రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దని మోదీని కోరాను. మోదీ ఇకపై రష్యా చమురును కొనుగోలు చేయబోమని నన్ను హామీ ఇచ్చారు. ఇది పుతిన్‌కు వెళ్లే నిధులను ఆపేందుకు ముందడుగు” అని అన్నారు. అలాగే చైనా కూడా ఇదే దిశగా అడుగులు వేస్తుందని చెప్పారు.
అయితే, ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ భారత ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. భారత్ ఎనర్జీ పాలసీపై అమెరికా అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూనే, దేశ ప్రయోజనాల మేరకు నిర్ణయాలు తీసుకుంటుందన్నది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ వైఖరి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో భారత్-అమెరికా సంబంధాలు, గ్లోబల్ ఎనర్జీ పాలసీలో మారుతున్న సవాళ్లు, విదేశాంగ వ్యూహాలకు సంబంధించి వివిధ విశ్లేషణలు చర్చకు వస్తున్నాయి. ఒకవైపు అమెరికా ఒత్తిళ్లు, మరోవైపు దేశ ఆర్థిక ప్రయోజనాల మధ్య కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
