Amaravati: మొంథా తుపాను (Montha cyclone)కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తృతంగా నష్టం సంభవించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) బుధవారం అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. తుపాను వల్ల కూలిపోయిన చెట్లు, విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించి రవాణా, విద్యుత్ వ్యవస్థలను పునరుద్ధరించాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆయన ఆదేశించారు. తుపాను ప్రభావిత జిల్లాలైన ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, గుంటూరు ప్రాంతాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పవన్ కల్యాణ్ నేరుగా మాట్లాడారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై వివరాలు తెలుసుకుంటూ, సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలని సూచించారు. ప్రజల భద్రతే ప్రథమ కర్తవ్యం. ఎక్కడా నిర్లక్ష్యం జరగకూడదు అని ఆయన స్పష్టం చేశారు.
తుపాను బలహీనపడినప్పటికీ భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలను తాత్కాలికంగా సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో తాగునీరు, ఆహారం, వసతి వంటి అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు పవన్ కల్యాణ్ సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తరువాత గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రాధాన్యతగా చేపట్టాలని చెప్పారు. తుపాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో, విద్యుత్ శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. తుపాను సమయంలో పడిపోయిన స్తంభాలు, తెగిపోయిన వైర్లను సరిచేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాలని సూచించారు.
ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ నది, నెల్లూరు జిల్లాలో పెన్నా నది మరియు అనేక వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని ఆయన తెలిపారు. ప్రమాదకర ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైతే తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. విపత్తు నిర్వహణ విభాగం, పోలీసు శాఖ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. తుపాను వల్ల నష్టపోయిన పంటలు, ఇళ్లు, మౌలిక వసతులపై పూర్తి నివేదికను సిద్ధం చేయాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ సహాయం పొందేందుకు సవివరమైన అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం వారి పక్కన నిలబడుతుంది. తుపాను నష్టం ఎంతైనా, పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేస్తాం అని హామీ ఇచ్చారు. మొంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాల్లో జీవన సౌకర్యాలు తిరిగి సాధారణ స్థితికి రావడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.
