Jaishankar: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ ఐక్యరాజ్యసమితి (United Nations) ప్రస్తుత పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన యూఎన్ 80వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ఆయన ప్రసంగిస్తూ, ఆ సంస్థ గ్లోబల్ సవాళ్లను ఎదుర్కొనడంలో విఫలమైందని, తన ప్రాముఖ్యతను కోల్పోయిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం యూఎన్ పూర్తిగా గ్రిడ్‌లాక్ (Gridlock) లోకి వెళ్లిపోయిందని, నిర్ణయాలు తీసుకునే విధానం పూర్తిగా ఏకపక్షంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జైశంకర్ మాట్లాడుతూ ..ప్రపంచంలోని ప్రజల అభిప్రాయాలు, అభ్యర్ధనలు, అవసరాలు ప్రతిబింబించని సంస్థగా యూఎన్ మారిపోయింది. ప్రాతినిధ్యం అనే మూల సూత్రాన్నే మరిచిపోయింది. ఉగ్రవాదం, గ్లోబల్ డెవలప్‌మెంట్ వంటి ముఖ్య అంశాలపై నిర్ణయాలు తీసుకోవడంలో యూఎన్ వైఫల్యం చెందింది. ఈ కారణంగా ఆ సంస్థపై ఉన్న విశ్వాసం దెబ్బతిన్నది అన్నారు.
భారత్ ఇప్పుడు ఐక్యరాజ్యసమితిలో ఒక బలమైన, ప్రభావవంతమైన దేశమని ఆయన తెలిపారు. అయినప్పటికీ, యూఎన్ వ్యవస్థ ప్రస్తుతానికి తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆయన హెచ్చరించారు. చట్టబద్ధమైన, పారదర్శకమైన నిర్ణయ ప్రక్రియలు కనపడడం లేదని, ఇది సంస్థ యొక్క ప్రతిష్ఠకు నష్టం కలిగిస్తోందని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితిలో అంతా సవ్యంగా లేదని జైశంకర్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమస్యలు వాతావరణ మార్పు, ఉగ్రవాదం, ఆర్థిక అసమానతల వంటి కీలక అంశాలను పరిష్కరించడంలో యూఎన్ విఫలమైందని ఆయన విమర్శించారు. యూఎన్ చర్చలు ఒకే దిశలో సాగుతున్నాయని, అన్ని సభ్య దేశాల అభిప్రాయాలను ప్రతిబింబించే విధంగా లేవని తెలిపారు. సంస్కరణలను నిలిపివేయడం వల్లే ఆ సంస్థ దిశ తప్పిందని జైశంకర్ వ్యాఖ్యానించారు.
భద్రతామండలి (UN Security Council)లో తక్షణ మార్పులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భారత్‌తో పాటు జపాన్, జర్మనీ, బ్రెజిల్ దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వడం ద్వారా మాత్రమే యూఎన్‌లో సమాన ప్రాతినిధ్యం ఏర్పడుతుందని సూచించారు. ఉగ్రవాదంపై యూఎన్ వైఖరిని కూడా ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఉగ్రవాద సంస్థలతోపాటు వాటికి మద్దతు ఇచ్చే దేశాలపై చర్యలు తీసుకోవడంలో యూఎన్ పూర్తిగా విఫలమైందని అన్నారు. పెహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి బాధ్యుడైన పాకిస్థాన్‌పై ఆంక్షలు విధించే ప్రయత్నాలను చైనా అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. మొత్తంగా, ప్రపంచ మార్పులకు అనుగుణంగా యూఎన్ వ్యవస్థలో సంస్కరణలు చేయాల్సిన అత్యవసరత ఉందని, లేకపోతే ఆ సంస్థ ప్రాముఖ్యత మరింత తగ్గిపోతుందని విదేశాంగ మంత్రి జైశంకర్ హెచ్చరించారు.
