- వరుస సభలతో కమలనాథుల హడావుడి
- ఒకే నెలలో ఇద్దరు భాజపా(BJP) అగ్ర నేతలు తెలంగాణకు రాక
- ఈ నెల 21న మునుగోడుకు అమిత్ షా(AmithShah)
- 27న హన్మకొండకు కమలదళపతి జేపీ. నడ్డా
Munugodu Elections : మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 21న మునుగోడులో భారీ బహిరంగ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా ముఖ్య అతిధిగా హాజరవుతున్న సభకు పెద్ధ ఎత్తున జనాన్ని సమీకరించేందుకు కాషాయదళం ప్రణాళికలు రచిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యేతో పాటు పలువురు కీలక నేతలు అమిత్ షా సమక్షంలో కాషాయతీర్థం పుచ్చుకోనున్నారు. బీజేపీలోలో చేరే మిగతా కీలక నేతల పేర్లు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు.
మునుగోడు దంగల్‌కు కాషాయదళం సిద్ధమవుతోంది. ఈ నెల 21న కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా మునుగోడులో పర్యటించనున్నారు. అమిత్ షా పర్యటన సందర్భంగా భారీ బహిరంగ సభకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు కాషాయతీర్థం పుచ్చుకోనున్నారు. అమిత్ షా పర్యటనలో మునుగోడు నుంచి బీజేపీలో చేరే నేతలకే అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే చౌటుప్పల్ ఎంపీపీ వెంకట్‌రెడ్డి టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. తెరాస అసంతృప్త నేతలపై బీజేపీ గురి పెట్టింది. అసంతృప్తితో రగిలిపోతున్నఅధికార పార్టీ నేతలను వలలో వేసుకునేందుకు బీజేపీ చేరికల కమిటీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. మరో వైపు కేసులు పెట్టి వేధించినా అండగా నిలుస్తామని కమలనాథులు భరోసా కల్పిస్తున్నారు. భవిష్యత్‌లో బీజేపీలో చేరికలు ఊహించని విధంగా పెద్ద ఎత్తున ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
27న పాదయాత్ర ముగింపు సభ
బండి సంజయ్ చేపట్టిన మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర హన్మకొండ జిల్లాలో ఈ నెల 27న ముగియనుంది. షెడ్యూల్ ప్రకారం 26న ముగించాల్సి ఉండగా ఈ నెల 21న మునుగోడు సభకు బండి సంజయ్ హాజరుకానుండటంతో ఆ రోజు పాదయాత్రకు విరామం కల్పించారు. దింతో పాదయాత్ర ఒక రోజు ఆలస్యంగా ముగుస్తుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో 27న భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ముగింపు సభకు కమలదళపతి జేపీ.నడ్డా హాజరవుతారని లేనిపక్షంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అధిత్యనాథ్ ముఖ్య అతిధిగా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ సభా వేదికగా టిఆర్ఎస్ కు రాజీనామా చేసిన మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్‌రావు, కన్నెబోయిన రాజయ్య యాదవ్‌తో పాటు మరికొంత మంది నేతలను బీజేపీలో చేర్పించేందుకు ఈటల రాజేందర్ ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. సభ ఎక్కడ జరిగినా.. సందర్భం ఏదైనా కొత్త వారికి కాషాయ కండువా కప్పడమే లక్ష్యంగా పెట్టుకుంది కాషాయదళం. ముగింపు సభకు భారీ ఎత్తున జనసమీకరణ చేపట్టాలని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలతో ఎప్పటికప్పుడు సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. చేరికలపై చాలా వరకు బీజేపీ నేతలు చాలా గోప్యత పాటిస్తున్నారు. అమిత్ షా సభలో చేరికలు భారీగా ఉండే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి మునుగోడు ఉప పోరులో బీజేపీకి కొత్త చేరికలు ఏ మేరకు ఉపయోగపడతాయో వేచిచూడాలి.