సీఎం రేవంత్‌రెడ్డి
డ్రగ్స్ విక్రేతలు(Drug Dealers), వినియోగదారుల (Drug Consumers)పై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) సిద్ధమవుతున్నది. అత్యాధునిక సాంకేతికత తెలిసిన, నిబద్ధతతో పనిచేసే పోలీస్ అధికారులతో ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) (EAGLE Team) వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈమేరకు గురువారం సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) హైదరాబాద్‌లోని
శిల్పకళా వేదికలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్, ఇల్లీగల్ ట్రాఫికింగ్ డే అవగాహన సదస్సులో ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘గగన తలంలో వెళ్తున్న గద్ద ఎలాగైతే భూమిపై ఉన్న తన టార్గెట్‌ను గుర్తించి, దానిపై దాడి చేస్తుందో.. అలాగే ‘ఈగల్’ టీం కూడా డ్రగ్స్ విక్రేతలు, వినియోదారులుపై ఉక్కుపాదం మోపతుంది.
రాష్ట్రవ్యాప్తంగా కోటిన్నర ఎకరాల మాగాణి ఉంది. ఆ భూమిలో ఎక్కడ గంజాయి మొక్కలు నాటినా నిమిషాల్లో ఈగల్ బృందానికి సమాచారం అందుతుంది. పండించే వారి పనిపడుతుంది. రాష్ట్రంలో ఎవరు డ్రగ్స్ అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన శిక్షలు ఉంటాయి. డ్రగ్స్ విక్రయాల కారణంగా పంజాబ్ యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకున్నారు. తెలంగాణలో అలాంటి పరిస్థితి రాకూడదనేది మా సంకల్పం.
అయినప్పటికీ కొందరు యువత డ్రగ్స్‌కు బానిస అవుతున్నారు. ఆ వార్తలు వింటుంటే మనసు తరుక్కుపోతుంది. తెలంగాణను మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చుకోవడం అందరి బాధ్యత’ అని సీఎం పిలుపునిచ్చారు.