Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ రంగంలో ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. టెక్ దిగ్గజం గూగుల్(Google),విశాఖపట్నం(Visakhapatnam)లో ప్రపంచ స్థాయి డేటా సెంటర్(Data Center)ను ఏర్పాటు చేయనుంది. ఇది రాష్ట్ర భవిష్యత్‌తోపాటు, దేశపు డిజిటల్ ప్రగతికి మైలురాయిగా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ అభివృద్ధిలో చారిత్రకమైన రోజు అని ఆయన అభివర్ణించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం గూగుల్ ఏకంగా 15 బిలియన్ డాలర్లు (దాదాపు ₹1.2 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిందని కేంద్ర ఐటీ మరియు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. అంతేగాక, ఈ డేటా సెంటర్ దక్షిణాసియా, ఆస్ట్రేలియా వంటి దేశాలతో సముద్రగర్భ కేబుల్ వ్యవస్థ ద్వారా విశాఖను అనుసంధానించనుంది. మయన్మార్ మీదుగా ఈశాన్య రాష్ట్రాలకు కనెక్టివిటీ మెరుగుపర్చే దిశగా గూగుల్ తో పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ..డేటా సెంటర్లు దేశానికి కొత్త రిఫైనరీలతో సమానం. విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంలో రాష్ట్రానికి మరిన్ని టెక్ ప్రాజెక్టులు రానున్నాయి అన్నారు. గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ టెక్ మ్యాప్‌లో తన ప్రత్యేకతను చాటనుందని, డిజిటల్ ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాల్లో ఓ కొత్త అధ్యాయం ప్రారంభమైందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) వంటి సేవలకు గూగుల్ సహకారం అందించాలని లోకేశ్ కోరారు. డేటా సెంటర్‌తో తక్కువ లేటెన్సీతో కూడిన సేవలు సాధ్యమవుతాయని, తద్వారా ప్రభుత్వ సేవల సమర్థత మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ..టెక్నాలజీకి ప్రాధాన్యతనిచ్చే రాష్ట్రాలదే భవిష్యత్. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన డేటా సెంటర్ పాలసీ ఫలితంగా ఇలాంటి భారీ ప్రాజెక్టులు సాధ్యమవుతున్నాయి అని తెలిపారు. AI వల్ల ఉద్యోగాలపై ఏర్పడుతున్న భయాలపై స్పందించిన ఆయన, నైపుణ్యాలను మెరుగుపరిచిన వారికే భవిష్యత్తులో విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మొత్తంగా, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ డిజిటల్ మ్యాప్‌లో నిలిపే దిశగా కీలకమైన మైలురాయిగా మారనుంది. ఇది పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు గట్టి పునాది వేస్తుంది.