Telangana Govt : తెలంగాణ రాష్ట్ర మహిళలకు(womens)శుభవార్త అందిస్తూ ప్రభుత్వం మరో కీలక సంక్షేమపథకాన్ని ప్రకటించింది. మహిళా సాధికారత, గౌరవం, ఆత్మవిశ్వాసం పెంపుదల లక్ష్యంగా ‘ఇందిరా మహిళా శక్తి చీరలు’(Indira Mahila Shakti sarees) పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అర్హులైన ఒక కోటి మంది మహిళలకు నాణ్యమైన చీరలను బహుమతిగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ పథకానికి శుభారంభం చేసి, మహిళల సంక్షేమానికై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు తెలియజేయనున్నారని ఆయన తెలిపారు.
మహిళల జీవితాల్లో సంపూర్ణ మార్పు తీసుకురావడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. గృహాల్లో, సమాజంలో మహిళలకు మరింత గౌరవం, భద్రత, ధైర్యం కలగాలన్న సంకల్పంతోనే ఈ పథకాన్ని రూపొందించామని ఆయన వివరించారు. ఇది కేవలం చీరల పంపిణీ మాత్రమే కాదు, మహిళల పట్ల ప్రభుత్వపు శ్రద్ధ, అభిమానం, ఆత్మీయతకు నిదర్శనమని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధికి మహిళల పాత్ర అపారమని, వారి శక్తి, ప్రతిభను గుర్తించి ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. చీరల పంపిణీని ప్రభుత్వం రెండు విడతలుగా నిర్వహించనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు మొదటి విడతగా నవంబర్ 19 నుంచి డిసెంబర్ 9 వరకు ఈ చీరలను పొందగలరు. ఇందుకు సంబంధించి జిల్లా, మండల స్థాయిలలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గ్రామాల్లోని అర్హులైన మహిళలకు సులభంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా చీరలు అందే విధంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం.
దీనికి అనుసంధానంగా పట్టణ ప్రాంత మహిళల కోసం రెండో విడత పంపిణీ మార్చి 1 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సమీపంలోనే ఈ కార్యక్రమాన్ని చేయడం ద్వారా మహిళల సాధికారత పట్ల ప్రభుత్వ నిబద్ధత వెలుగుచూపుతోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పట్టణాల్లో పంపిణీ జరుగునపుడు మున్సిపల్ అధికారులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించే అవకాశముంది. ప్రభుత్వం చేపట్టిన ఈ కొత్త కార్యక్రమం మహిళల్లో ఆనందాన్ని కలిగించడమే కాక, సామాజికంగా మహిళల స్థానాన్ని మరింత బలపరచడంలో దోహదపడుతుందని భావిస్తున్నారు. ‘ఇందిరా మహిళా శక్తి చీరలు’ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల మరోసారి తన నిబద్ధతను చాటిచెప్పింది.
