India : భారత్ మరియు ఆఫ్ఘనిస్థాన్(Afghanistan) తమ మధ్య వాణిజ్యాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. పాకిస్థాన్ (Pakistan)విధిస్తున్న భూమార్గ అడ్డంకులను పక్కన పెట్టి, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించాలన్న ఉద్దేశంతో ఇరు దేశాలు సమగ్ర ప్రణాళికలు రూపొందించాయి. ఈ క్రమంలో, ఇరాన్‌లోని చాబహార్ పోర్ట్ వినియోగాన్ని పెంచడమే కాక ఢిల్లీ, కాబూల్ మరియు అమృత్‌సర్, కాబూల్ మార్గాల్లో రెండు ప్రత్యేక కార్గో విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఇరు పక్షాలు వెల్లడించాయి. ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ తాత్కాలిక వాణిజ్య, పరిశ్రమల మంత్రి నూరుద్దీన్ అజీజీ, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఆనంద్ ప్రకాశ్‌తో కలిసి ఈ వివరాలను ప్రకటించారు.
ఇప్పటికే భారత్, ఆఫ్ఘన్ మధ్య సంవత్సరానికి బిలియన్ డాలర్లకు పైగా వాణిజ్యం జరుగుతున్న నేపథ్యంలో, కొత్త రవాణా సౌకర్యాలు ప్రారంభమైతే వ్యాపార పరిమాణం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. భూమార్గం అందుబాటులో లేకపోవడం రెండు దేశాల వాణిజ్యానికి ప్రధాన అడ్డంకిగా మారింది. పాకిస్థాన్ ఆక్రమిత గిల్గిత్-బాల్టిస్థాన్ కారణంగా భారత్ నుంచి ఆఫ్ఘనిస్థాన్‌కు నేరుగా రోడ్డు మార్గం లేకపోవడంతో ఇప్పటి వరకు సముద్ర, వాయు మార్గాలపైనే ఆధారపడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో చాబహార్ పోర్ట్ ప్రాధాన్యత మరింత పెరుగుతోంది. ఈ పోర్ట్ ద్వారా సరుకులు వేగంగా, తక్కువ ఖర్చుతో ఆఫ్ఘనిస్థాన్‌కు చేరవచ్చని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఈ సందర్భంగా మంత్రి అజీజీ మాట్లాడుతూ..రాజకీయాలను వ్యాపారంతో కలపకూడదు. భారత పెట్టుబడిదారులకు మా దేశం తెరవబడి ఉంది. ముఖ్యంగా మైనింగ్, వ్యవసాయం, ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేవారికి పన్ను రాయితీలు, ఉచిత భూఆవకాశాలు వంటి ప్రోత్సాహకాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం అని స్పష్టం చేశారు.
అదేవిధంగా ఆఫ్ఘన్ సిక్కు, హిందూ వ్యాపారవేత్తలు కూడా తమ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషించాలని ఆయన కోరారు. పాకిస్థాన్ తరచూ సరిహద్దులను మూసివేయడం, వాణిజ్య నియమాలను కఠినతరం చేయడం వల్ల ఆఫ్ఘన్ వ్యాపారులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌తో ప్రత్యక్ష, నమ్మకమైన రవాణా సౌకర్యాలు కల్పించాలన్న ఆఫ్ఘనిస్థాన్ నిర్ణయం కీలకంగా నిలుస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న రెండు కార్గో విమాన సర్వీసులు పండ్లు, డ్రై ఫ్రూట్స్, ఔషధ మొక్కలు వంటి త్వరగా పాడయ్యే సరుకులను వేగంగా రవాణా చేయడంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయి. ఈ కొత్త కార్యక్రమాలతో భారత్,ఆఫ్ఘనిస్థాన్ వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని, ప్రాంతీయ ఆర్థిక సహకారానికి ఇవి కొత్త ప్రమాణాలు సెట్ చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
