Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు (Israeli PM Benjamin Netanyahu)భారత పర్యటన (India tour)మరో దఫా వాయిదా పడింది. ఇటీవల ఢిల్లీ(Delhi)లో చోటుచేసుకున్న పేలుడు ఘటన(Explosion incident)తో పాటు ఏర్పడిన భద్రతా ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాదిలోనే ఆయన పర్యటన వాయిదా పడటం ఇది మూడోసారి కావడం విశేషం. ఈ సంవత్సరం సెప్టెంబర్ 9న నెతన్యాహు భారత్‌కు రావాల్సి ఉన్నా, సెప్టెంబర్ 17న ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో కీలక ఓటింగ్ ఉండడంతో ఆ పర్యటన రద్దైంది. దీనికి ముందు ఏప్రిల్‌లో కూడా ఆయన పర్యటనను ఏర్పాట్ల దశలోనే వాయిదా వేసుకున్నారు.
తాజా ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో ఇప్పుడు మూడోసారి పర్యటన నిలిచిపోయింది. ఈ పరిణామాలు ఇరు దేశాల మధ్య ఉన్న దౌత్య సంబంధాలపై ప్రత్యక్ష ప్రభావం చూపకపోయినా, షెడ్యూళ్లపై మాత్రం వరుస మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బెంజమిన్ నెతన్యాహు మధ్య వ్యక్తిగత స్నేహం, రాజకీయ అనుబంధం బలంగా ఉన్న విషయం తెలిసిందే. నెతన్యాహు చివరిసారిగా 2018 జనవరిలో భారత్‌ను సందర్శించగా, 2017లో మోదీ చారిత్రాత్మకంగా ఇజ్రాయెల్‌ను సందర్శించి ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త దశను ఆరంభించారు. ఇజ్రాయెల్ నేలపై అడుగుపెట్టిన తొలి భారత ప్రధానిగా మోదీ ప్రత్యేక గుర్తింపు పొందారు. అనంతరం ఇరు దేశాల మధ్య రక్షణ, వ్యవసాయం, నీటి పారుదల, సాంకేతికత వంటి పలు రంగాలలో భాగస్వామ్యం మరింత బలపడింది. ఇటీవలి ఢిల్లీ పేలుడు ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోవడం, పలువురు గాయపడటం భారత్‌లో భద్రతా వాతావరణంపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది.
ఈ నేపథ్యంలో ఉన్నతస్థాయి విదేశీ నాయకుల పర్యటనల విషయంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వంతో పంచుకోవడంతో, నెతన్యాహు పర్యటనను మరింత అనుకూల సమయానికి మార్చుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన భారత పర్యటన వచ్చే ఏడాది జరిగే అవకాశాలు ఉన్నాయని దౌత్య వర్గాలు సూచిస్తున్నాయి. కొత్త తేదీల కోసం ఇరు దేశాలు పరస్పర చర్చలు జరుపుతున్నాయి. పేలుడు ఘటన విచారణ పూర్తవుతూ, భద్రతా పరిస్థితులు పూర్తిగా మెరుగుపడిన తర్వాతే పర్యటన తేదీలు ఖరారయ్యే అవకాశం ఉందని సమాచారం. తద్వారా భారత,ఇజ్రాయెల్ సంబంధాల్లో ఈ వాయిదాలు తాత్కాలికమేనని, భవిష్యత్ భాగస్వామ్యం మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
