Bangladesh: బంగ్లాదేశ్‌లో అల్లర్ల కేసు(Bangladesh riots case)లో ఢాకా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)కు మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, 16 ఏళ్ల క్రితం జరిగిన బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటు(Bangladesh Rifles mutiny)కు సంబంధించి ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తు కొత్త వెలుగులు నూరుతోంది. ఆ ఘటనను పరిశీలించిన కమిషన్ తాజాగా విడుదల చేసిన నివేదికలో హసీనా పాత్రపై తీవ్రమైన ఆరోపణలు చేయడం ఆ దేశ రాజకీయాల్లో మరో కలకలం రేపింది.
2009లో జరిగిన రెండు రోజుల రైఫిల్స్ తిరుగుబాటులో అగ్ర సైనికాధికారులతో సహా 74 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తిరుగుబాటు వెనుక హసీనానే ఉన్నారనే అభియోగాలు ఇప్పటికే వినిపించినప్పటికీ, కమిషన్ తాజాగా వెల్లడించిన వివరాలు రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తం చేశాయి. విచారణలో లభించిన ఆధారాల ప్రకారం, తిరుగుబాటుకు స్వయంగా హసీనా ఆదేశాలు జారీ చేసినట్లు కమిషన్ పేర్కొంది. అదే సమయంలో బంగ్లాదేశ్ ఆర్మీని బలహీనపర్చేందుకు భారతదేశం ప్రయత్నించిందని కూడా నివేదిక ఆరోపించింది. ఈ సందర్భంలో ఏఎఫ్‌పీ ప్రచురించిన పాత కథనాన్ని కమిషన్ ప్రస్తావించింది. హసీనా రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ తిరుగుబాటు చోటుచేసుకోవడం గమనార్హం. తిరుగుబాటులో అప్పటి ఆవామీ లీగ్ ప్రభుత్వ నాయకులు కూడా నేరుగా పాల్గొన్నట్లు కమిషన్ పేర్కొంది. ముఖ్యంగా మాజీ ఎంపీ ఫజ్లే నూర్ తపోష్ హసీనా ఆదేశాల మేరకు ఈ కుట్రను ముందుండి నడిపించినట్లు నివేదిక వెల్లడించింది. తిరుగుబాటు సమయంలో జరిగిన హత్యలకు హసీనానే ప్రధాన కారణమని కమిషన్ స్పష్టంగా పేర్కొంది.
అదే సమయంలో భారతదేశంపై కూడా నివేదికలో ఆరోపణలు ఉన్నాయి. తిరుగుబాటుకు ముందు తరువాత అస్థిరత సృష్టించే దిశగా భారత్ ప్రయత్నించిందని, ఆ సమయంలో 921 మంది భారతీయులు ఢాకాకు వచ్చినట్లు కమిషన్ పేర్కొంది. వారిలో 67మంది ఇప్పటికీ కనిపించలేదని నివేదిక లో చెప్పింది. ఈ ఆరోపణలపై భారత్ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. గతేడాది విద్యార్థుల ఆందోళనలు తీవ్రమవడంతో షేక్ హసీనా ప్రధాని నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అనంతరం ఆమె ఆగస్టు 5న బంగ్లాదేశ్‌ను విడిచి భారత్‌కు చేరుకున్నారు. అప్పటి నుండి ఆమె న్యూ ఢిల్లీలోని రహస్య ప్రదేశంలో ఉన్నట్లు సమాచారం. హసీనా పలు కేసుల్లో దోషిగా తేలిన నేపథ్యంలో ఆమెను తిరిగి బంగ్లాదేశ్‌కు అప్పగించాలని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం భారత్‌ను పలుమార్లు కోరింది. ఈ నేపథ్యంలో తిరుగుబాటు నివేదిక వెలుగుచూడడం బంగ్లా రాజకీయ సంక్షోభాన్ని మరింత ముదిరేలా చేసింది.
