Imran Khan: పాకిస్థాన్ (Pakistan)మాజీ ప్రధానమంత్రి, తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)మళ్లీ దేశవ్యాప్తంగా చర్చకు కారణమయ్యారు. తనను అక్రమంగా జైలులో నిర్బంధించేందుకు, తన ప్రస్తుత దుస్థితికి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ (Pakistan Army Chief General Asim Munir) ఒక్కరే బాధ్యులని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం రావల్పిండిలోని అడియాలా జైల్లో తన అక్క ఉజ్మా ఖానమ్ (Uzma Khanum)ను 20 నిమిషాలపాటు కలిసిన సందర్భంగా ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ఈ భేటీతో ఇమ్రాన్ మరణించినట్టుగా గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో వ్యాప్తి చెందిన వదంతులకు పూర్తి స్థాయిలో బ్రేక్ పడింది. దాదాపు 25 రోజుల తర్వాత కుటుంబ సభ్యుడిని కలిసిన ఇది ఇమ్రాన్ తొలి అవకాశంగా నిలిచింది. తర్వాత మీడియాతో మాట్లాడిన ఉజ్మా, తన సోదరుని ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ, తీవ్రమైన ఒత్తిడులు, మానసిక వేధింపులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
అల్లా దయవల్ల ఆయన సురక్షితంగానే ఉన్నారు. కానీ తనను పూర్తిగా ఒంటరిగా ఉంచి మానసికంగా బాధిస్తున్నారు. రోజులో కొద్దిసేపు తప్ప మిగతా సమయమంతా స్వల్పస్థలంలోనే బంధిస్తున్నారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన కొన్ని సోషల్ మీడియా పోస్టులు ఇమ్రాన్ పరిస్థితిపై అనుమానాలు రేకెత్తించాయి. జైలు అధికారులు కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలవడానికి అనుమతించకపోవడంతో ఆ వదంతులకు మరింత ఊపిరి వచ్చింది. దీంతో పీటీఐ కార్యకర్తలు ఇస్లామాబాద్, రావల్పిండిల్లో రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ఇమ్రాన్ ఖాన్ పెరుగుతున్న ప్రజాదరణకు భయపడిన షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆయనను మానసికంగా కుంగదీసేందుకు కుట్రలు పన్నుతోందని పీటీఐ ఆరోపిస్తోంది.
పీటీఐ సెనేటర్ ఖుర్రం జీషన్ మాట్లాడుతూ, ఇమ్రాన్‌ను దేశం విడిచిపోవాల్సిందే అన్న ఒత్తిడికి గురిచేయడానికి ఉద్దేశపూర్వకంగా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. 72 ఏళ్ల మాజీ క్రికెట్ కెప్టెన్, ప్రపంచకప్ విజేత అయిన ఇమ్రాన్ ఖాన్ తోషాఖానా కేసు సహా పలు ఆరోపణల్లో దోషిగా తేలడంతో 2023 ఆగస్టు నుంచి జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అడియాలా జైల్లో జరిగిన తాజా భేటీతో ఇమ్రాన్ ఆరోగ్యం, ప్రాణాపాయం వంటి అనుమానాలు కొంతవరకు నివృత్తి అయ్యాయి కానీ, ఆయన నిర్బంధం చుట్టూ ఉన్న రాజకీయ ఉద్రిక్తత మాత్రం మరింత పెరిగినట్టే కనిపిస్తోంది. పాకిస్థాన్ రాజకీయాల్లో వేడి వాతావరణం కొనసాగుతుందని విశ్లేషకులు సూచిస్తున్నారు.
