Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) మరోసారి వాణిజ్య రంగంలో ఉద్రిక్తతలు రేకెత్తించేలా వ్యాఖ్యలు చేశారు. భారత్(India) నుంచి దిగుమతి(Import) అవుతున్న బియ్యం(rice), కెనడా నుంచి వచ్చే ఎరువులపై కొత్తగా కఠిన సుంకాలు విధించే అవకాశాన్ని సూచిస్తూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. వైట్‌హౌస్‌లో అమెరికా రైతులకు భారీ సహాయక ప్యాకేజీని ప్రకటించే వేళ ఇవి ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు. వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో ట్రంప్, అమెరికా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై స్పందిస్తూ 12 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. అమెరికా రైతుల కోసం ఈ సాయం అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతల వల్ల వచ్చిన నష్టాలను భర్తీ చేసే ఉద్దేశంతో ఇవ్వబడుతున్నదని ఆయన తెలిపారు. ఇతర దేశాలపై విధించిన సుంకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఈ ప్యాకేజీకి వినియోగిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు.
భారత్, కెనడా వంటి దేశాలతో జరుగుతున్న వాణిజ్య చర్చల్లో ఆశించిన పురోగతి జరగకపోవడం ట్రంప్ ఆగ్రహానికి కారణమైందని వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా భారత్ నుంచి వచ్చే బియ్యం దిగుమతుల వల్ల అమెరికా స్థానిక రైతులు నష్టపోతున్నారనే ఆరోపణలను ఆయన మళ్లీ ప్రస్తావించారు. సమావేశంలో ఒక రైతు, అమెరికా రిటైల్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడయ్యే రెండు ప్రధాన రైస్ బ్రాండ్లు భారత కంపెనీలవేనని చెప్పగా, ట్రంప్ వెంటనే స్పందిస్తూ, దానిపై చర్యలు తప్పకుండా తీసుకుంటాం. సుంకాలు విధిస్తే రెండు నిమిషాల్లో సమస్య సర్దిపోతుంది అని అన్నారు. అలాగే, భారత కంపెనీలు తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో డంపింగ్ చేస్తున్నాయనే ఆరోపణలను కూడా ఆయన పునరుద్ఘాటించారు. కేవలం భారత్ మాత్రమే కాకుండా, కెనడా నుంచి వచ్చే ఎరువులపైనా అధిక సుంకాలు విధించే అవకాశాన్ని ట్రంప్ సూచించారు.
స్థానిక ఎరువు తయారీదారులను బలోపేతం చేయడానికి ఈ చర్యలు అవసరమని ఆయన పేర్కొన్నారు. అమెరికా రైతులను దేశానికి వెన్నెముకగా అభివర్ణించిన ట్రంప్, వారి ప్రయోజనాలను కాపాడడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఇదిలా ఉండగా, గత కొన్నేళ్లుగా భారత్, అమెరికా వ్యవసాయ వాణిజ్యం వేగంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. భారత్ నుంచి బాస్మతి బియ్యం, సుగంధ ద్రవ్యాలు భారీగా ఎగుమతి అవుతుండగా, అమెరికా నుంచి బాదం, పత్తి వంటి ఉత్పత్తులు భారత్ దిగుమతి చేసుకుంటోంది. అయితే సబ్సిడీలు, మార్కెట్ యాక్సెస్, డంపింగ్ ఆరోపణలు వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య WTO వేదికగా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ట్రంప్ తాజా వ్యాఖ్యలు, రాబోయే రోజుల్లో భారత్, అమెరికా వాణిజ్య సంబంధాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారితీయవచ్చన్న ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.
