Amaravati : రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు(Increase in electricity charges) పై ఏర్పడిన అనుమానాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) కీలక ప్రకటన చేశారు. మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, హెచ్‌వోడీలతో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఈ ఏడాదికి విద్యుత్ ధరలను ఏ విధంగానూ పెంచబోమని స్పష్టం చేశారు. ప్రజలపై అదనపు భారాన్ని మోపే యోచన ప్రభుత్వం వద్ద లేదని సీఎం తెలిపారు. సమావేశంలో సీఎం గత ప్రభుత్వ విధానాల వల్ల విద్యుత్ రంగానికి భారీ నష్టం వాటిల్లిందని విమర్శించారు. వైసీపీ పాలన సమయంలో పీపీఎలను రద్దుచేయడం వల్లే దాదాపు రూ. 9 వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగానికి గురయ్యిందని ఆయన వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన వెంటనే బహిరంగ మార్కెట్‌లో యూనిట్‌కు రూ.5.19 చొప్పున విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చిన పరిస్థితి నెలకొందని, అయితే ఆ ధరను ప్రభుత్వం రూ.4.92కు తీసుకువచ్చిందని సీఎం వివరించారు.
విద్యుత్ నియంత్రణ కమిషన్ రూ. 9 వేల కోట్ల మేర ఛార్జీల పెంపుకు అనుమతి ఇచ్చినప్పటికీ, ప్రజల ప్రయోజనాల కోసం ఆ భారాన్ని మోనని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఐదేళ్లలో విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్‌కు రూ.4కి తగ్గించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వంలోని “సూపర్ సిక్స్” కార్యక్రమాలు ఇప్పటికే ఫలితాలు ఇస్తున్నాయని, కేవలం పెన్షన్ల రూపంలోనే ఇప్పటి వరకు రాష్ట్రంలోని పేదలకు రూ.50 వేల కోట్లకు పైగా పంపిణీ చేశామని సీఎం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ గత పాలనలో దెబ్బతిన్నప్పటికీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ఇమేజ్‌ను తిరిగి నిలబెట్టగలిగామని ఆయన అన్నారు. ఇటీవల విశాఖలో జరిగిన పెట్టుబడి సదస్సులో భారీ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించామని, దీంతో యువతకు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. మొదటి త్రైమాసికంలో 12.02% వృద్ధి, రెండో త్రైమాసికంలో 11.28% వృద్ధి సాధించడం రాష్ట్ర పురోగతికి నిదర్శనమని సీఎం పేర్కొన్నారు.
జాతీయ సగటు 8.70% కంటే ఎక్కువ వృద్ధిరేటును సాధించగలగడం పాజిటివ్ సంకేతమని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి 17.11% వృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. నీటి భద్రతపై ముందుచూపుతో పని చేస్తూ సాగు నీటి ప్రాజెక్టుల్లో 944 టీఎంసీల నీటిని భద్రపరచ గలిగామని చెప్పారు. అధికార యంత్రాంగం శాస్త్రీయ దృక్కోణంతో పనిచేసి అభివృద్ధికి నూతన మార్గాలను అన్వేషించాలని సూచించారు. రాష్ట్రాన్ని జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లుగా విభజించి సమగ్ర అభివృద్ధి చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు. ప్రభుత్వ శాఖల పనితీరును ప్రజలకు అనుగుణంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నామని, జనవరి 15 నాటికి అన్ని సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. టీటీడీ పనితీరు మెరుగుపడుతున్నప్పటికీ దేవదాయ శాఖలో మరింత సవరణల అవసరం ఉందని తెలిపారు. ఈ సందర్భంలో సీఎం ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజలతో మరింత సాన్నిహితంగా ఉండాలని, సేవల నాణ్యతను పెంచాలని సూచించారు. రాష్ట్రం పురోగతి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని, ఆంధ్రప్రదేశ్ మళ్లీ దేశంలో అభివృద్ధికి ప్రథమ ఉదాహరణగా నిలుస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.
