end
=
Saturday, December 20, 2025
వార్తలుఅంతర్జాతీయంబంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక ఆందోళనలు: హింసాత్మక నిరసనలు, దాడులు
- Advertisment -

బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక ఆందోళనలు: హింసాత్మక నిరసనలు, దాడులు

- Advertisment -
- Advertisment -

Bangladesh: బంగ్లాదేశ్‌లో తాజాగా చోటుచేసుకున్న రాజకీయ హింస దేశాన్ని మరోసారి తీవ్ర ఉద్రిక్తతల వైపు నెట్టింది. కొద్దిరోజుల క్రితం జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇంక్విలాబ్‌ మంచ్‌ కన్వీనర్‌ షరీఫ్‌ ఉస్మాన్‌ బిన్‌ హైది(Sharif Usman Hadi), సింగపూర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హైది మరణ వార్త వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. రాజధాని ఢాకా(Dhaka)తో పాటు పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైది మరణానికి నిరసనగా ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి, అధికార అవామీలీగ్‌ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా చత్తోగ్రామ్‌లో పరిస్థితి అదుపు తప్పింది. అక్కడ ఉన్న భారత అసిస్టెంట్‌ హైకమిషన్‌ కార్యాలయాన్ని రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఆందోళనకారులు ముట్టడించారు. భారత్‌కు వ్యతిరేకంగా, అవామీలీగ్‌ పార్టీపై విమర్శలతో కూడిన నినాదాలు మారుమోగాయి. భద్రతా కారణాలతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఇదే సమయంలో బంగ్లాదేశ్‌ మీడియా సంస్థలపై కూడా దాడులు చోటుచేసుకున్నాయి. ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘డెయిలీ స్టార్‌’ కార్యాలయాన్ని అల్లరిమూకలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఢాకాలోని కవ్రాన్‌ బజార్‌ ప్రాంతంలో ఉన్న ఆ పత్రిక కార్యాలయానికి నిప్పు పెట్టారు. మంటలు వేగంగా వ్యాపించడంతో అక్కడ పనిచేస్తున్న జర్నలిస్టులు ప్రాణభయంతో చిక్కుకున్నారు. గంటల తరబడి సహాయక చర్యలు కొనసాగించి సుమారు 25 మంది జర్నలిస్టులను అగ్నికీలల నుంచి బయటకు తీసుకొచ్చారు. రక్షించబడిన వారిలో మహిళా జర్నలిస్టులు కూడా ఉన్నారు. రెండు అంతస్తులు పూర్తిగా మంటల్లో దగ్ధమయ్యాయి. ఇంతటితో ఆగకుండా బెంగాలీ దినపత్రిక ‘ప్రోథోమ్‌ అలో’ కార్యాలయంపై కూడా దుండగులు దాడులు చేశారు. పరిస్థితిని శాంతింపజేయాలని ప్రయత్నించిన ‘న్యూఏజ్‌’ పత్రిక ఎడిటర్‌ నూరుల్‌ కబీర్‌పైనా దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లోని ప్రధాన పత్రికలు భద్రతా కారణాలతో నేడు తమ ప్రచురణ, కార్యాలయ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశాయి.

ఆందోళనకారుల ఆగ్రహం చారిత్రక ప్రదేశాలపైనా పడింది. బంగ్లాదేశ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్‌ ముజిబుర్‌ రహమాన్‌ కుటుంబానికి చెందిన ధన్‌మోండీ 32 ప్రాంతంలోని నివాసాన్ని వారు ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఆ భవనాన్ని మ్యూజియంగా ఉపయోగిస్తున్నారు. ఈ దాడి దేశ చరిత్రకు అవమానమని పలువురు మేధావులు వ్యాఖ్యానించారు. గత ఏడాది జులైలో అవామీలీగ్‌ నేత, ప్రధాని షేక్‌ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో షరీఫ్‌ ఉస్మాన్‌ బిన్‌ హైది కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత కాలంలో అతడు భారత్‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. గత శుక్రవారం గుర్తుతెలియని దుండగులు అతడిపై కాల్పులు జరపగా, తీవ్రంగా గాయపడిన హైది చికిత్స కోసం సింగపూర్‌కు వెళ్లాడు. అక్కడే అతడు తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటన బంగ్లాదేశ్‌ రాజకీయాల్లో మరోసారి అగ్ని రాజేసినట్లైంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -