Telangana Legislature : తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాల(Winter Session) రెండో రోజు తీవ్ర ఉత్కంఠతో కొనసాగుతోంది. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత(Urea deficiency) అంశాన్ని చర్చకు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (BRS) అసెంబ్లీ వేదికగా భారీ నిరసనకు దిగింది. దీంతో ఉదయం నుంచే సభా వ్యవహారాలు గందరగోళ వాతావరణంలోకి వెళ్లాయి. సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతలు, సభ్యులు చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని అసెంబ్లీ హాల్‌లోకి ప్రవేశించారు. “కాంగ్రెస్ వచ్చింది… రైతులను నిండా ముంచింది” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతులకు సకాలంలో యూరియా అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వ్యవసాయ సీజన్ కీలక దశలో ఉన్నప్పటికీ ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
వెంటనే యూరియా సరఫరా మెరుగుపరచాలని, ఈ అంశంపై సభలో తక్షణమే చర్చ జరగాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో యూరియా కొరతపై చర్చ చేపట్టాలంటూ బీఆర్ఎస్ సభ్యులు వాయిదా తీర్మానాన్ని కూడా సమర్పించారు. అయితే ప్రతిపక్షాల ఆందోళనపై శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ఘాటుగా స్పందించారు. ప్రశ్నోత్తరాల సమయం జరగకుండా అడ్డుకోవడమే ప్రతిపక్ష ఉద్దేశమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై మాట్లాడాలంటే సభా నిబంధనలకు లోబడి నిర్ణీత విధానాల్లో చర్చకు రావాలని, నిరసనలతో సభా సమయాన్ని వృథా చేయడం సరికాదని మంత్రి హితవు పలికారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు యూరియా అంశంపై పాయింట్ ఆఫ్ ఆర్డర్ కోరారు. అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దాన్ని పూర్తిగా తిరస్కరించారు. ప్రశ్నోత్తరాల సమయంలో పాయింట్ ఆఫ్ ఆర్డర్‌కు అవకాశం లేదని ఆయన స్పష్టంగా తెలిపారు.
ఈ విషయాన్ని మాజీ మంత్రి హరీశ్ రావుకు కూడా క్లియర్ కట్‌గా వివరించారు. స్పీకర్ నిర్ణయానికి ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. నినాదాలు కొనసాగించడంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. రైతుల సమస్యలను పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపించగా, ప్రభుత్వం మాత్రం యూరియా సరఫరాపై స్పష్టమైన చర్యలు తీసుకుంటున్నామని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో రైతుల సమస్యలపై ప్రభుత్వం–ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతంగా మారింది. సభా కార్యకలాపాలు ఎటు దారి తీస్తాయన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
