end
=
Saturday, January 10, 2026
వార్తలురాష్ట్రీయంఅమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ వేళ జైశంకర్ భద్రతకు భారీ ఆపరేషన్
- Advertisment -

అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ వేళ జైశంకర్ భద్రతకు భారీ ఆపరేషన్

- Advertisment -
- Advertisment -

Jaishankar: అమెరికాలో ప్రభుత్వ(America Government) షట్‌డౌన్(Shutdown) ప్రభావం అనూహ్యంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (Jaishankar)ప్రయాణంపై పడింది. విమాన సర్వీసులు నిలిచిపోవడంతో, ఐక్యరాజ్యసమితి (ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌తో ముందుగా నిర్ణయించిన కీలక సమావేశానికి ఆయన హాజరయ్యేలా చేయడానికి అమెరికా భద్రతా అధికారులు అసాధారణమైన చర్యలకు దిగారు. ఈ ఆసక్తికర ఘటన గత ఏడాది సెప్టెంబర్‌లో జరగగా, తాజాగా అమెరికా విదేశాంగ శాఖకు చెందిన డిప్లొమాటిక్ సెక్యూరిటీ సర్వీస్ (డీఎస్ఎస్) విడుదల చేసిన నివేదికలో పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి.

షట్‌డౌన్ కారణంగా విమానాలు అందుబాటులో లేకపోవడంతో, యూఎస్–కెనడా సరిహద్దులోని లూయిస్టన్–క్వీన్స్‌టన్ బ్రిడ్జి వద్ద మంత్రి జైశంకర్ భద్రతను డీఎస్ఎస్ ఏజెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి న్యూయార్క్ నగరంలోని మాన్‌హాటన్‌కు చేరుకునేందుకు సుమారు 416 మైళ్లు, అంటే దాదాపు 670 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి వచ్చింది. ఈ ప్రయాణానికి సుమారు ఏడు గంటల సమయం పట్టినట్లు నివేదిక వెల్లడించింది.

ఈ మొత్తం ఆపరేషన్‌లో 27 మంది భద్రతా ఏజెంట్లు పాల్గొన్నారు. తీవ్రమైన చలి, మంచు కురుస్తుండటం, దారులు స్పష్టంగా కనిపించకపోవడం వంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, భద్రతా బృందం అప్రమత్తతతో వ్యవహరించింది. డ్రైవర్లను మారుస్తూ అలసట లేకుండా ప్రయాణాన్ని కొనసాగించారు. మార్గమధ్యంలో ఒక చోట పేలుడు పదార్థాలను గుర్తించే శిక్షణ పొందిన జాగిలం మంత్రి ప్రయాణిస్తున్న వాహనంపై అనుమానం వ్యక్తం చేయడంతో, వెంటనే ఆ ప్రాంతాన్ని భద్రతా అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేసి, ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించిన తర్వాతనే ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించారు.

న్యూయార్క్ నగరానికి చేరుకున్న అనంతరం కూడా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. హిట్ అండ్ రన్ ప్రమాదంలో గాయపడిన ఓ మహిళకు భద్రతా బృందంలోని ఒక ఏజెంట్ మానవీయతతో సహాయం అందించారు. ఇలాంటి అనుకోని పరిస్థితులు ఎదురైనా, మంత్రి భద్రతలో ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నామని డీఎస్ఎస్ తన నివేదికలో స్పష్టం చేసింది. చివరకు అన్ని అడ్డంకులను అధిగమించి, మంత్రి జైశంకర్ ఐరాస సమావేశంలో పాల్గొనేలా చేయడం తమ మిషన్ విజయమని పేర్కొంది.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -