Donald Trump: డెన్మార్క్ (Denmark)ఆధీనంలో ఉన్న గ్రీన్‌లాండ్‌ను(Greenland) తమ దేశంలో విలీనం చేసుకునే అంశంపై అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం(Donald Trump government) మరోసారి చర్చలకు తెరలేపినట్లు సమాచారం. గ్రీన్‌లాండ్ ప్రజలను డెన్మార్క్ నుంచి విడిపోయి అమెరికాతో కలవాలనేలా ఒప్పించేందుకు, నేరుగా నగదు ప్రోత్సాహకం అందించే ప్రతిపాదనను వైట్ హౌస్ పరిశీలిస్తున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ ప్రతిపాదన అమలైతే, ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గ్రీన్‌లాండ్‌లో సుమారు 57 వేల మంది పౌరులు ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరికి 10 వేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల వరకు నేరుగా చెల్లించాలనే ఆలోచన అమెరికా అధికారుల్లో ఉందని సమాచారం.
ఈ లెక్కన మొత్తం ఖర్చు దాదాపు 6 బిలియన్ డాలర్ల వరకు చేరవచ్చని అంచనా. నగదు ప్రలోభంతో ప్రజాభిప్రాయాన్ని మార్చి, రాజకీయంగా గ్రీన్‌లాండ్‌ను తమ వైపు తిప్పుకోవాలన్నది ట్రంప్ యంత్రాంగం ఆలోచనగా తెలుస్తోంది. అయితే, గ్రీన్‌లాండ్‌ను అమ్మే ప్రసక్తే లేదని డెన్మార్క్ ప్రభుత్వం, గ్రీన్‌లాండ్ స్థానిక ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంగా ప్రకటించాయి. ఈ అంశంపై ఎలాంటి రాజీ లేదని పేర్కొన్నాయి. అంతేకాదు, తమ ఆర్కిటిక్ భూభాగంలోకి ఎవరైనా అనుమతి లేకుండా ప్రవేశిస్తే, ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురుచూడకుండా వెంటనే కాల్పులు జరపాలని డెన్మార్క్ తమ సైనికులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ హెచ్చరికతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. గ్రీన్‌లాండ్ అపారమైన ఖనిజ సంపద, ఆర్కిటిక్ ప్రాంతంలో వ్యూహాత్మక ప్రాధాన్యం, జాతీయ భద్రత పరమైన అవసరాల కారణంగా అమెరికాకు ఎంతో కీలకమని ట్రంప్ చాలాకాలంగా వాదిస్తున్నారు.
ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కేవలం నగదు చెల్లింపులే కాకుండా, సైనిక చర్యలు లేదా ‘కాంపాక్ట్ ఆఫ్ ఫ్రీ అసోసియేషన్’ (COFA) వంటి ఒప్పంద మార్గాలను కూడా అమెరికా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం, అమెరికా రక్షణ బాధ్యతలు చేపడుతుంది, అయితే ఆ దేశంలో తమ సైన్యం స్వేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా, గ్రీన్‌లాండ్ ప్రజలు డెన్మార్క్ నుంచి స్వాతంత్ర్యాన్ని కోరుకుంటున్నప్పటికీ, అమెరికాలో విలీనం కావడంపై ఆసక్తి చూపడం లేదని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. “గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించుకోవాలనే కల్పిత ఆలోచనలను మానుకోండి” అంటూ ఆ దేశ ప్రధాని జెన్స్-ఫ్రెడెరిక్ నీల్సన్ ఇప్పటికే ట్రంప్‌ను హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో అమెరికా వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయన్నది అంతర్జాతీయ వేదికపై ఆసక్తికర చర్చగా మారింది.
