America : అమెరికా ప్రభుత్వం(US government) వలస విధానాల్లో (mmigration policies)భాగంగా సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. 2025 సంవత్సరంలో ఇప్పటివరకు లక్షకు పైగా విదేశీ వీసాలను రద్దు (Cancellation of foreign visas)చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఇది అమెరికా చరిత్రలోనే ఒక రికార్డు స్థాయి చర్యగా పేర్కొంది. గత ఏడాది 2024తో పోలిస్తే ఈ సంఖ్య ఏకంగా 150 శాతం పెరిగిందని వెల్లడించింది. దేశ భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది. వలస విధానాల విషయంలో ట్రంప్ ప్రభుత్వం మొదటి నుంచే కఠిన వైఖరిని అవలంబిస్తోంది. అక్రమ వలసలు, నేర కార్యకలాపాలు, ప్రజా భద్రతకు ముప్పుగా మారే అంశాలను అరికట్టడమే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది.
అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ ప్రతినిధి టామీ పిగాట్ మాట్లాడుతూ.. అమెరికా పౌరుల భద్రత, దేశ సార్వభౌమత్వం కాపాడటమే మా ప్రభుత్వ తొలి ప్రాధాన్యం అని స్పష్టం చేశారు. రద్దు చేసిన వీసాలలో సుమారు 8 వేల వరకు విద్యార్థి వీసాలు ఉండగా, దాదాపు 2,500 ప్రత్యేక నైపుణ్యం కలిగిన ఉద్యోగుల వీసాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఉద్యోగుల వీసాల విషయంలో నేరాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. నేర కార్యకలాపాల్లో ఉన్న ప్రత్యేక ఉద్యోగుల వీసాలలో సుమారు 50 శాతం మంది మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసులు (డ్రంకన్ డ్రైవింగ్) కాగా 30 శాతం మంది దాడులకు సంబంధించిన కేసుల్లో ఉన్నారని అధికారులు వెల్లడించారు.
అలాగే వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్రమంగా దేశంలోనే ఉండిపోవడం, దొంగతనాలు, దాడులు, ఇతర నేరాలకు పాల్పడటం వంటివి వీసాల రద్దుకు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. ఇలాంటి నేరస్తులను దేశం నుంచి బయటకు పంపడం ద్వారా అమెరికాను మరింత సురక్షితంగా ఉంచుతామని విదేశాంగ శాఖ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా తెలిపింది. విదేశీయులు అమెరికా చట్టాలకు కట్టుబడి ఉన్నారా లేదా అన్నది నిరంతరం పర్యవేక్షించేందుకు కంటిన్యూయస్ వెట్టింగ్ సెంటర్ అనే కొత్త విభాగాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా కార్యకలాపాలను సైతం పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం మీద, వలసదారుల విషయంలో ట్రంప్ ప్రభుత్వం అత్యంత కఠినమైన విధానాలను కొనసాగించబోతోందని ఈ చర్యలు స్పష్టంగా సూచిస్తున్నాయి. భవిష్యత్తులో కూడా ఈ కఠిన వైఖరి కొనసాగుతుందని అధికార వర్గాలు సంకేతాలిచ్చాయి.
