Kurnool Bus Accident: కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. బెంగళూరు (Bangalore) నుండి హైదరాబాద్(Hyderabad)కు బయలుదేరిన ఓ ప్రైవేట్ వోల్వో బస్సు మంటల్లో చిక్కుకొని బూడిదైపోయింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమై మరణించినట్లు ప్రాథమిక సమాచారం. ఇంకా కొంతమంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం కావేరి ట్రావెల్స్ (Kaveri Travels)సంస్థకు చెందిన వోల్వో బస్సు గురువారం రాత్రి బెంగళూరులోని మజెస్టిక్ బస్టాండ్ నుంచి బయలుదేరింది. మొత్తం 40 మంది ప్రయాణికులు హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్నారు. తెల్లవారుజామున కర్నూలు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది.
బస్సు వేగంగా ప్రయాణిస్తుండగా రోడ్డుపై ఎదురుగా వెళ్తున్న ఓ స్కూటర్‌ను ఢీకొట్టింది. ఢీకొట్టిన వెంటనే బస్సు ముందు భాగంలో భారీ మంటలు చెలరేగాయి. ఒక్క క్షణంలోనే మంటలు బస్సు మొత్తాన్ని చుట్టుముట్టాయి. ఆ సమయంలో చాలా మంది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో, వారు ఏం జరిగిందో గ్రహించేలోపే అగ్ని జ్వాలల్లో చిక్కుకున్నారు. కొంతమంది అప్రమత్తమై అత్యవసర ద్వారాన్ని పగలగొట్టి బయటపడటానికి ప్రయత్నించారు. అందులో 12 మంది ప్రాణాలతో బయటపడగా, వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, ప్రయాణికుల కేకలు విన్న వెంటనే గ్రామస్థులు పరుగెత్తి వచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కానీ అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. అగ్నిమాపక చర్యల అనంతరం మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స చేస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. బస్సులో ప్రయాణించిన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు కావచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బస్సు ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యమా లేక యాంత్రిక లోపమా అనే దానిపై విచారణ కొనసాగుతోంది. మరోవైపు, ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఈ ఉదయం ఒక పెద్ద విషాదానికి సాక్షిగా మారింది.
