ఆధార్ కార్డు (Aadhar Card)ను ప్రభుత్వ, ప్రైవేటు సేవలు పొందేందుకు వినియోగించుకోవచ్చని, కానీ.. దానిని పౌరసత్వానికి (Citizenship) రుజువుగా పరిగణించలేమని సుప్రీం కోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. ఓటరు జాబితా సవరణలో భాగంగా, ఆధార్ వివరాలను తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు సమర్థిస్తూ ఈ తీర్పు వెలువరించింది.
బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) (Special Intensive Revision)పై దాఖలైన పిటిషన్లపై మంగళవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీతో కూడిన ధర్మాసనం (Judges Bench) విచారణ చేపట్టింది. ఆధార్ కార్డు, రేషన్‌కార్డు, ఎలక్ట్రోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డులను పౌరసత్వానికి రుజువులు కావని కోర్టు తేల్చిచెప్పింది. “ఆధార్ కార్డును పౌరసత్వానికి తిరుగులేని రుజువుగా అంగీకరించలేమని ఈసీ చెప్పడం సరైనదే” అని ధర్మాసనం పేర్కొన్నది.
ఈసీ చేపట్టిన ప్రక్రియలో ఎన్నో అసమానతలు ఉన్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఓ నియోజకవర్గంలో చనిపోయినట్లుగా ఈసీ పేర్కొన్న 12 మంది సజీవంగానే ఉన్నారని సిబల్ ధర్మాసనానికి తెలిపారు. ఈసీ తరఫు న్యాయవాది రాకేశ్ ద్వివేది తన వాదనలు వినిపిస్తూ.. చనిపోయిన వారిని బతికి ఉన్నట్లుగా, సజీవంగా ఉన్నవారిని చనిపోయినట్లుగా ప్రకటించడం వంటి తప్పిదాలను సరిదిద్దవచ్చని తెలిపారు.
ఈసీ ప్రకటించింది.. కేవలం ముసాయిదా మాత్రమేనని, ఎలక్ట్రోరల్ రివిజన్ రాజ్యాంగబద్ధమైనదని పేర్కొన్నారు. ఆధార్, రేషన్ కార్డులు పౌరుల పౌరసత్వాన్ని తెలిపేవి కావని వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం స్పందిస్తూ.. ఓటర్ల జాబితాకు సంబంధించిన వాస్తవాలు, గణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఈసీని ఆదేశించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ముందు ఎంత మంది ఓటర్లు ఉన్నారు,
గతంలో నమోదైన మరణాల సంఖ్య, ఇప్పుడు నమోదు చేసిన మరణాల సంఖ్య వంటి గణాంకాలు ఈసీ వద్ద ఉండాలని, వాటిపైనే మున్ముందు ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉందని కోర్టు పేర్కొన్నది.