Telangana : తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ(Janasena party)కి నూతన ఉత్సాహం తీసుకువచ్చేలా పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సూచనల మేరకు తెలంగాణలో ఉన్న జనసేన కమిటీలన్నిటినీ (Janasena Committees) రద్దు (cancellation)చేస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి అధికారికంగా వెల్లడించారు. ఈ నిర్ణయం పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా తీసుకున్నదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న జనసేన కమిటీల్లో ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధి కమిటీలు, వీరమహిళ విభాగం, యువజన విభాగం, విద్యార్థి విభాగాలకు చెందిన నిర్మాణాలను పూర్తిగా రద్దు చేశారు.
వాటి స్థానంలో తాత్కాలికంగా అడ్‌హాక్ కమిటీలను నియమించారు. ఈ అడ్‌హాక్ కమిటీలు రాబోయే 30 రోజుల పాటు పనిచేస్తూ పార్టీ పునర్వ్యవస్థీకరణలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ తాత్కాలిక కమిటీల సభ్యులు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు 300 వార్డులను సందర్శించి, అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా అధ్యయనం చేస్తారు. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తున్న చురుకైన కార్యకర్తలను గుర్తించడం, వారితో సమన్వయం పెంచుకోవడం ఈ పర్యటనల ప్రధాన ఉద్దేశంగా ఉంది. ప్రతి వార్డు నుంచి కనీసం ఐదుగురు క్రియాశీల సభ్యులను ఎంపిక చేసి, వారి వివరాలతో కూడిన నివేదికను పార్టీ కార్యాలయానికి సమర్పించాలని అడ్‌హాక్ కమిటీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
ఈ నివేదికలను ఆధారంగా తీసుకుని త్వరలోనే శాశ్వత కమిటీలను ప్రకటించనున్నారు. కొత్త కమిటీల నిర్మాణంలో క్షేత్రస్థాయి కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ పునర్వ్యవస్థీకరణతో తెలంగాణలో జనసేన పార్టీకి కొత్త ఊపిరి వస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న నాయకత్వం ఎదగడంతో పార్టీ ప్రజల్లో మరింత చేరువ అవుతుందని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ తెలంగాణలోనూ సుస్థిరమైన రాజకీయ శక్తిగా ఎదగాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
