Washington: అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చైనా(China)కు మరోసారి షాక్ ఇచ్చారు. ఇప్పటికే ఉన్న సుంకాలకు తోడు, తాజాగా చైనా దిగుమతులపై అదనంగా 100 శాతం టారిఫ్‌లు (సుంకాలు)(100 percent tariffs) విధించనున్నట్టు ప్రకటించారు. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ కొత్త టారిఫ్‌లు అమలులోకి రానున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటనకు కొన్ని గంటల ముందు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా అరుదైన ఖనిజాల ఎగుమతులపై ఆంక్షలు విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇది అన్యాయ నిర్ణయం. చైనా ఓ దూకుడు రాజకీయాన్ని అనుసరిస్తోంది అని విమర్శించారు. తనకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో భేటీకి అవసరం లేదని, అవసరమైతే భేటీని రద్దు చేస్తానని హెచ్చరించారు.
ట్రంప్ మాట్లాడుతూ చైనా నిర్ణయానికి స్పందనగా మేము దెబ్బతీసే నిర్ణయాలు తీసుకుంటున్నాం. దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం అన్నారు. ప్రస్తుతం 30 శాతం ఉన్న టారిఫ్‌లు 100 శాతానికి పెరగడం సంచలనం సృష్టిస్తోంది. ఇది ప్రపంచ మార్కెట్లలో కలకలం రేపే అవకాశం ఉంది. ఇంతకముందే అమెరికా-చైనా మధ్య వాణిజ్య సంబంధాలు ఉద్రిక్తత భరితంగా మారిన నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న తాజా చర్య వాణిజ్య యుద్ధం మరో దశలోకి వెళ్లినట్లుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా ఈ పరిణామంపై ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికర అంశంగా మారింది.
ఇక, వచ్చే రెండు వారాల్లో ట్రంప్ దక్షిణకొరియాలో పర్యటించనున్నారు. అదే సమయంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో భేటీ కూడా షెడ్యూల్ లో ఉంది. అయితే ఆ భేటీకి ముందు ఇలా భారీ టారిఫ్‌ల విధానంతో ట్రంప్ తన అభిప్రాయాన్ని బలంగా వ్యక్తపరిచినట్టు స్పష్టమవుతోంది. ఈ చర్యలు అమెరికాలోనూ, అంతర్జాతీయంగానూ హాట్ టాపిక్‌గా మారాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అరుదైన ఖనిజాలు ముఖ్యంగా టెక్నాలజీ రంగానికి కీలకమైన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌పై చైనా ఆంక్షలు పెట్టడం పట్ల ట్రంప్ తీవ్రమైన అసహనాన్ని వ్యక్తపరిచారు. ఇది అమెరికా టెక్ పరిశ్రమపై ప్రభావం చూపే అవకాశముండటంతో, స్పందనగా వాణిజ్య పరమైన కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. అంతిమంగా, ట్రంప్ ఈ ప్రకటనతో చైనాకు వ్యాపారపరమైన కఠిన సందేశం పంపించారు. ఇది రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త వాతావరణాన్ని మరింత ముదుర్చే అవకాశం ఉంది. కాగా, ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపే అవకాశముంది.