AP Agreement with Google: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అభివృద్ధి దిశగా మరో అడుగు ముందుకు వేసింది. టెక్నాలజీ దిగ్గజం గూగుల్(Google) రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రానికి, దేశానికి మైలురాయిగా నిలవబోయే ఈ చారిత్రాత్మక ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రూపాంతరం చెందనుంది. విశాఖపట్నం కేంద్రంగా రూ. 88,628 కోట్ల (10 బిలియన్ డాలర్ల) వ్యయంతో హైపర్ స్కేల్ డేటా సెంటర్ మరియు దేశంలో తొలి “గూగుల్ ఏఐ హబ్” (GoogleAI Hub) ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు అవగాహన ఒప్పందం (MoU)పై అక్టోబర్ 15న ఢిల్లీలో అధికారికంగా సంతకాలు జరగనున్నాయి. ఢిల్లీలోని తాజ్ మాన్‌సింగ్ హోటల్ వేదికగా ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, తదితరులు పాల్గొననున్నారు. గూగుల్ అనుబంధ సంస్థ ‘రైడెన్’ ప్రతినిధులు, ఏపీ ప్రభుత్వ అధికారులు ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు.
ఇది భారత్‌లోని ఇతర ఎఫ్‌డీఐ (FDI) పెట్టుబడులతో పోల్చితే ఇప్పటిదాకా రానున్న అత్యంత భారీ విదేశీ పెట్టుబడి కావడం విశేషం. ఇది ఆంధ్రప్రదేశ్‌ను మాత్రమే కాక, దేశ టెక్నాలజీ రంగాన్నే ఒక కొత్త దిశలో తీసుకెళ్ళే అవకాశముంది. ఈ ప్రాజెక్టుకు పునాది గత ఏడాది (2024) అక్టోబర్‌లో వేసినట్టు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్ తెలిపారు. ఆయన అమెరికా పర్యటనలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తో చర్చలు జరిపారు. ఇప్పుడు అవి కార్యరూపం దాల్చడం రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. ఈ ఒప్పందంతో వచ్చే ఐదేళ్లలో (2026–2030) గూగుల్ రాష్ట్రంలో పెట్టుబడులు చేస్తుంది. ఈ ప్రాజెక్టు ఆసియాలో గూగుల్ చేపట్టబోయే అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా గుర్తింపు పొందనుంది.
ప్రభుత్వ అంచనాల ప్రకారం, 2028–2032 మధ్యకాలంలో ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్ర జీఎస్‌డీపీకి ప్రతి సంవత్సరం రూ.10,518 కోట్లు ఆదాయం చేకూరే అవకాశం ఉంది. అంతేకాకుండా, ప్రముఖంగా 1,88,220 ఉద్యోగాలు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సృష్టించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. విశాఖపట్నం త్వరలోనే “ఏఐ సిటీ” గా రూపాంతరం చెందనుంది. గూగుల్ ఏఐ హబ్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, యంత్ర అభ్యాసం (Machine Learning), డీప్ లెర్నింగ్ వంటి రంగాల్లో రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించనుంది. టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ కేంద్రంగా విశాఖను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్టు వేగంగా అమలుకు అవసరమైన సింగిల్ విండో అనుమతులు, మౌలిక వసతులు, పునరుత్పాదక ఇంధన వనరులు వంటి అంశాలపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైంది. ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు మరియు ఐటీ శాఖలు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నాయి. ఈ ఒప్పందం కేవలం పెట్టుబడి మాత్రమే కాక, రాష్ట్ర యువతకు శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధి, పరిశోధనలకు అవకాశాలు కల్పించనుంది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని డిజిటల్ హబ్‌గా మార్చే దిశగా ఇది కీలక మైలురాయిగా నిలవనుంది.