ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
బీసీ బిల్లు (BC Bills)ను అడ్డుకుంటున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే (BJP Govt)నని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (TG CM Revanth) ఆరోపించారు. ప్రధాన మంత్రి మోదీ (PM Modi) ఉద్దేశపూర్వకంగా బిల్లలను ఆపుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ శాసన సభ (TG Assembly)లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) కల్పించేందుకు అసెంబ్లీలో ఆమోదించిన రెండు బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ
ఢిల్లీలోని జంతర్ మంతర్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బీసీల ఆత్మగౌరవ మహాధర్నా`లో సీఎం మాట్లాడారు.
బీజేపీని గద్దె దించే రోజు వస్తుంది..
బిల్లులు ఆమోదించకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు, దేశంలోని బలహీన వర్గాలకు తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. తమ డిమాండ్‌ను ఆమోదించాలని, లేదంటే ప్రజలు బీజేపీని గద్దె దించే రోజు వస్తుందని సీఎం జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం, రాష్ట్రంలో కులగణన చేపట్టి, దాని ఆధారంగా బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లులు ఆమోదించామని సీఎం గుర్తుచేశారు.
బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపి నాలుగు నెలలు గడిచినా, కేంద్ర ప్రభుత్వం వాటిని తొక్కిపెట్టిందని ఆరోపించారు. ఈ విషయంపై చర్చించేందుకు తాము రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ అడిగామని, కానీ ఇప్పటివరకు అపాయింట్‌మెంట్ రాలేదని వాపోయారు. దీని వెనుక ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒత్తిడి ఉందని తాము అనుమానిస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ బీసీ బిల్లులను తుంగలో తొక్కే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారని నిలదీశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తుంటే ప్రధాని, హోం మంత్రికి కడుపుమంట ఎందుకని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి మారకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రధాని మోదీ బలహీనవర్గాలకు బద్ధశత్రువు. ఆయనకు బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన లేదు. బీసీ బిల్లును ఆమోదించకపోతే, వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని గద్దె దించి ఇండియా కూటమిని అధికారంలోకి తెస్తాం.
రాహుల్ గాంధీని ప్రధానిని చేసి, మా రిజర్వేషన్లను మేమే సాధించుకుంటాం అని ప్రతినబూనారు. ముస్లింల పేరు చెప్పి బీజేపీ బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తోందని, ఆ బిల్లలు కేవలం బలహీన వర్గాల కోసమేనని సీఎం స్పష్టం చేశారు. ధర్నాకు ఇండియా కూటమిలోని పార్టీలు, వంద మంది ఎంపీలు మద్దతు తెలిపారని చెప్పారు.