టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్‌ను ఉంచుదామనుకుందేమో. కానీ, వారి ఆశలపై ఆర్సీబీ బౌలర్లు నీళ్లు చల్లారు. ఆరంభం నుంచే కేకేఆర్ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచి, ఏ విధంగానూ కోలుకోనీయలేదు. కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 84 పరుగులు మాత్రమే చేయగలిగింది. జట్టు స్కోరు 3 వద్ద ఉండగానే సిరాజ్.. త్రిపాఠిని ఔట్ చేశాడు. తర్వాతి బంతికే నితీష్ రాణాను డకౌట్ గా వెనక్కి పంపాడు. అదే స్కోరు వద్ద ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్(6 బంతుల్లో 1 పరుగు)ను సైనీ ఔట్ చేశాడు.
ఆర్సీబీ బౌలర్లు.. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్‌ను క్రీజులో నిలదొక్కుకోనీయలేదు. ప్రతి బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలబడడానికే ఆపసోపాలు పడ్డారు. నలుగురు బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(34 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. ఆర్సీబీ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్4 ఓవర్లు బౌలింగ్ వేసి, కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 3 వికెట్లు పడగొట్టాడు. అందులో 2 మెయిడిన్లు ఉండడం విశేషం. చాహల్ 2 వికెట్లు, సైనీ, సుందర్ చెరో వికెట్ తీసుకున్నారు.