end
=
Thursday, January 1, 2026
వార్తలురాష్ట్రీయంవైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు
- Advertisment -

వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

- Advertisment -
- Advertisment -

YSRCP: గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు (Ambati Rambab)మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు వైసీపీ నాయకులపై పట్టాభిపురం పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, విధుల్లో ఉన్న సిబ్బందిని బెదిరించడం వంటి ఆరోపణలతో ఈ కేసులు నమోదైనట్లు సమాచారం. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇటీవల గుంటూరు పట్టణంలో వైసీపీ ఆధ్వర్యంలో వైద్య కళాశాలల పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) విధానాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ, ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనకు ముందస్తు అనుమతి తీసుకోకపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడిందని, ప్రజలకు అసౌకర్యం కలిగిందని పోలీసులు పేర్కొన్నారు. ర్యాలీ సందర్భంగా అంబటి రాంబాబు, ఇతర వైసీపీ నేతలు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అనుమతి లేదని, ర్యాలీని నిలిపేయాలని సూచించగా, అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

ఇద్దరి మధ్య మాటామాటా తగవు చోటుచేసుకోవడంతో కొద్ది సేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ పరిస్థితుల్లో పోలీసులు ర్యాలీని చెదరగొట్టేందుకు ప్రయత్నించగా, అక్కడ కొంత గందరగోళం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేయగా, అంబటి రాంబాబు సహా పలువురు వైసీపీ నాయకులు నిందితులుగా ఉన్నారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం, ఈ కేసు భారతీయ న్యాయ సంహిత (భారత న్యాయ సవరణ చట్టం – బీఎన్‌ఎస్‌)లోని సెక్షన్లు 132, 126(2), 351(3), 189(2) రీడ్ విత్ 190 కింద నమోదు చేశారు. ఈ సెక్షన్లు ప్రధానంగా పోలీసు విధుల్ని అడ్డుకోవడం, ప్రభుత్వ అధికారులను బెదిరించడం, ప్రజా శాంతి భద్రతకు విఘాతం కలిగించడం వంటి అంశాలకు సంబంధించినవిగా తెలుస్తోంది.

ఇదే అంశంపై అంబటి రాంబాబు స్పందిస్తూ..మేము ప్రజల సమస్యల కోసం శాంతియుతంగా ఆందోళన చేశాం. ప్రజా ప్రయోజనాల కోసం మాట్లాడితే కూడా కేసులు పెడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి తూటా అని వ్యాఖ్యానించారు. అయితే, పోలీసులు మాత్రం చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉండగా, పోలీసులు సంఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు, సాక్ష్యాలను సేకరిస్తున్నారు. గుంటూరులో నిన్న చోటుచేసుకున్న ఈ ఘటన స్థానిక రాజకీయ వాతావరణాన్ని కుదిపేసింది. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఏ దిశగా మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -