భారతదేశంలో రాజ్యాంగ (Indian Constitution)మే అత్యున్నతమైందని, ప్రజాస్వామ్యం (Democracy)లోని పొలిటికల్, ఎగ్జిక్యుటివ్, జ్యుడీషియరీ విభాగాలు వేటికవే పనిచేస్తాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (Supreme Court Chief Justice) జస్టిస్ బీఆర్ గవాయ్ (BR Gavai) ఉద్ఘాటించారు. మహారాష్ట్రలోని ప్రధాన నగరమైన అమరావతిలో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మరోసారి రాజ్యాంగ విలువల (Constitutional Values)పై మాట్లాడారు.
‘రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంట్‌కు అధికారాలు ఉన్నాయే కానీ, రాజ్యాంగం ప్రాథమిక రూపాన్ని మాత్రం అవి మార్చలేవు’ అని తేల్చిచెప్పారు. ఎంతోమంది పార్లమెంట్ అత్యున్నతమైందని వ్యాఖ్యలు చేస్తారని, ఆ వ్యాఖ్యల్లో నిజం లేదని కుండ బద్దలు కొట్టారు. భారత రాజ్యాంగమే అన్నిటికన్నా సర్వోన్నతమైనదని తెలిపారు. న్యాయమూర్తులు ఎవరికి వారు తమ విధులను నిర్వహిస్తున్నారనే సంగతిని గుర్తుంచుకోవాలని సూచించారు.
‘మనం ప్రజల హక్కులు, రాజ్యాంగ విలువలు, నిబంధనలకు రక్షకులం. కేవలం మనకు తీర్పులు చెప్పే అధికారమే లేదు. మనకు బాధ్యతలూ ఉన్నాయి. తీర్పుల గురించి ప్రజలు ఏమనుకొంటున్నారన్నది న్యాయమూర్తులను ఏమాత్రం ప్రభావితం చేయకూడదు. న్యాయమూర్తులు రాజ్యాంగానికి లోబడి స్వతంత్రంగా ఆలోచించగలగాలి’ అని అభిప్రాయపడ్డారు.