Amaravati : రాజధాని అమరావతిలో అభివృద్ధి మళ్లీ ఊపందుకుంది. దీని ప్రతీకగా నూతనంగా నిర్మించిన సీఆర్డీఏ (Capital Region Development Authority) ప్రధాన కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) సోమవారం అధికారికంగా ప్రారంభించారు. వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి పూర్ణకుంభంతో, వేదాశీర్వచనాలతో వేదపండితులు ఆయనకు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి, శుభప్రదమైన ఈ సందర్భంలో భూములు ఇచ్చిన రైతులను ఆత్మీయంగా కలుసుకుని, వారితో మనస్పూర్తిగా ముచ్చటించారు.
ఈ భవనం జీ+7 ఫ్లోర్లతో కూడిన ఆధునిక నిర్మాణం. మొత్తం 4.32 ఎకరాల విస్తీర్ణంలో 3,07,326 చదరపు అడుగుల కట్టడాన్ని అత్యాధునిక సాంకేతికతతో తీర్చిదిద్దారు. అమరావతి ఆత్మను ప్రతిబింబించేలా భవనం ముందు భాగంలో ‘ఎ’ అక్షరాన్ని అద్భుతమైన ఎలివేషన్ రూపంలో రూపొందించారు. ఈ భవనంలో సీఆర్డీఏతో పాటు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన అనుబంధ కార్యాలయాలన్నీ స్థానం పొందనున్నాయి. ప్రధాన భవనానికి అదనంగా, దాని పక్కనే మరో 8 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు విభిన్న భవనాలు కూడా నిర్మించబడ్డాయి. ఒక్కో భవనం సుమారు 41,500 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించారు. పాలనా సమన్వయాన్ని మెరుగుపర్చేందుకు వివిధ హెచ్‌వోడీల కార్యాలయాలను ఒకే ప్రాంతంలో సమీకరించేలా ఈ భవన సముదాయం రూపొందించారు.
సీఆర్డీఏ ప్రధాన భవనంలో ఉపయోగాన్ని బట్టి అంతస్థులు విభజించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇది నగర పాలనకు నర్వ్ సెంటర్‌గా పనిచేస్తుంది. మొదటి అంతస్తులో ముఖ్యమైన సమావేశ మందిరాలు ఉన్నాయి. రెండో, మూడో, ఐదో అంతస్తుల్లో సీఆర్డీఏ శాఖలు పని చేయనున్నాయి. నాలుగో అంతస్తులో సీడీఎంఏ పురపాలక డైరెక్టరేట్, ఆరో అంతస్తులో అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ భవన సముదాయం అమరావతి రాజధానిగా రూపొందించబడుతున్న ప్రక్రియలో ఓ మైలురాయిగా నిలిచింది. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అమరావతిలో అభివృద్ధి మరో మెట్టు ఎక్కినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యాలయాల ప్రారంభంతో పాలనా వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.