Mangalagiri : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (Police Commemoration Day)సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu)సోమవారం మంగళగిరిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీఎస్పీ బెటాలియన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమ ఆరంభంలో భద్రతా దళాల నుండి గౌరవ వందనం స్వీకరించిన సీఎం చంద్రబాబు, అనంతరం అమరవీరుల స్మారక స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి హృదయపూర్వక నివాళులు అర్పించారు. పోలీసుల సేవలను ఆయన గౌరవంతో కొనియాడారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నవారే నిజమైన రక్షకులు అని అన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. శాంతి భద్రతలతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది. అల్లర్ల వల్ల పెట్టుబడులు రావు. రాష్ట్రంలో క్రైమ్ రేట్‌ను అణచేందుకు నేను ఎప్పటికీ రాజీపడను అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల ప్రదర్శన దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిందని సీఎం పేర్కొన్నారు. రౌడీయిజం, నక్సలిజం, ఫ్యాక్షనిజం లాంటి బెదిరింపులకు గట్టి పోరాటం చేసి పోలీసుల పేరును దేశవ్యాప్తంగా నిలిపారని గుర్తు చేశారు. పోలీసులు కఠినంగా వ్యవహరించినా, వారి హృదయంలో మానవత్వం చెరగని ముద్రలా ఉంటుంది అని అన్నారు. నేటి నేరాల ధోరణి మారుతోందని, సైబర్ నేరాలు, వైట్ కాలర్ క్రైమ్స్ పెరుగుతున్నాయని చెప్పారు. ప్రతి 55 కిలోమీటర్లకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్నాం. డ్రగ్స్, గంజాయి, ఎర్రచందనం మాఫియాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు. పోలీసింగ్ ఇప్పుడు విజిబుల్‌తో పాటు ఇన్విజిబుల్‌గా కూడా ఉండాలి. నేరస్తులు స్మార్ట్‌గా వ్యవహరిస్తే, మనం ఇంకా ముందుండాలి. పోలీసులు కూడా కొత్త వెర్షన్‌కి అప్‌గ్రేడ్ కావాలి అని సూచించారు.
గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు వైజాగ్‌లో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రంలోని శాంతి భద్రతలే ప్రధాన కారణమని తెలిపారు. అంతేగాక, “ఏఐ టెక్నాలజీ భవిష్యత్తు. అయితే రాజకీయ వేషాల మీదుగా కొత్త రకమైన నేరాలు కూడా పెరుగుతున్నాయి. కొన్ని పార్టీలు ఫేక్ ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవి సమాజానికి హానికరం” అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమం ఘనంగా ముగిసింది.
