Saudi Arabia Bus Accident: సౌదీ అరేబియాలో భారతీయులను కలవరపరిచిన ఘోర ఘటన చోటుచేసుకుంది. ఉమ్రా యాత్ర (Umrah pilgrimage)పూర్తి చేసుకుని మక్కా నుంచి మదీనాకు బయలుదేరిన ప్రత్యేక బస్సు, బదర్ మదీనా హైవేలోని ముఫరహత్ ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో భారీ ప్రమాదం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున సుమారు 1.30 గంటలకు జరిగిన ఈ ఢీ అంటే ఢీకొట్టిన మోత వెంటనే బస్సులోని ఇంధన భాగాలకు మంటలు అంటుకుని క్షణాల్లోనే అగ్నికీలలు చెలరేగాయి. తీవ్ర వేడిమి, పొగ కారణంగా ప్రయాణికులెవరూ బయటకు రాలేకపోయారని విదేశీ మీడియా వార్తల్లో వెల్లడైంది. ఈ విషాదంలో మొత్తం 42 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉండటం మరింత కలత కలిగిస్తోంది. అగ్నిప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండడంతో బాధితుల శరీరాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్నాయని స్థానిక అధికారుల నివేదికలు చెబుతున్నాయి.
రక్షణ చర్యలు చేపట్టిన సివిల్ డిఫెన్స్ సిబ్బందికి కూడా మంటలను అదుపులోకి తేవడానికి గణనీయమైన సమయం పట్టింది. ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన అన్ని వివరాలు వెంటనే సేకరించాలని, సౌదీ అధికారులతో మరియు భారత్ రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధితుల కుటుంబాలకు అండగా నిలవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక చర్యలు ప్రారంభించినట్లు సీఎం ప్రకటించారు. సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి, బాధితుల వివరాలు, గుర్తింపు ప్రక్రియ, అలాగే అవసరమైన సహాయం కోసం కుటుంబాలు సంప్రదించవలసిన హెల్ప్‌లైన్ నెంబర్‌లను విడుదల చేశారు. 79979 59754, 99129 19545 నంబర్లకు ఫోన్ చేస్తే అవసరమైన సమాచారం అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంలో హైదరాబాద్ మల్లేపల్లి బజార్ ఘాట్ కు చెందిన 16 మంది యాత్రికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం. వీరంతా ఉమ్రా ట్రావెల్స్ ద్వారా పవిత్ర యాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే వారి ఇళ్లలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు భావోద్వేగాలకు లోనవుతూ ప్రియమైన వారిని కోల్పోయిన బాధను వ్యక్తం చేస్తున్నారు. మక్కా–మదీనా మార్గంలో ఇలాంటి ప్రమాదాలు అరుదుగా జరుగుతాయి. అయితే ఈసారి జరిగిన ప్రమాదం తీవ్రత కారణంగా ఇది ఇటీవల కాలంలో జరిగిన అత్యంత దుర్ఘటనగా నమోదైంది. బాధితుల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాక మృతదేహాలను భారత్‌కు తరలించే చర్యలు ప్రారంభించనున్నట్లు సౌదీ అధికారులు తెలిపారు.
