బీసీ రిజర్వేషన్ బిల్లుల సాధనకు పోరాటం
రాష్ట్రపతి ఆమోదం కోసం ఒత్తిడి
తెలంగాణ శాసనసభ (Telangana Asssembly) ఆమోదించిన వెనుకబడిన తరగతుల (Back Ward Classes) రిజర్వేషన్ బిల్లుల(Reservations)కు రాష్ట్రపతి (President) ఆమోదం కోరుతూ బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ (Congress Party) భారీ ధర్నా (Protest)నిర్వహించనున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)నేతృత్వంలో జరిగే నిరసనలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క సహా పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొననున్నారు. వీరంతా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. కొందరు మూడు రోజులు ముందుగానే తెలంగాణ నుంచి ప్రత్యేక రైలులో వెళ్లారు. ధర్నా తర్వాత గురువారం ముఖ్యమంత్రి, ఇతర సీనియర్ నాయకులతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కానున్నారు. సమావేశంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే కూడా పాల్గొంటారని తెలిసింది. వీరు బీసీ బిల్లులకు సంబంధించి మెమోరాండం సమర్పించనున్నారు. మరో వైపు ఇదే అంశంపై లోక్‌సభలో చర్చ కోసం పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నిరసన కార్యక్రమాల ద్వారా కేంద్రంతో పాటు రాష్ట్రపతిపై ఒత్తిడి పెంచి.. బిల్లుల ఆమోదం సాధించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.