. సస్పెండ్ అయిన సిబ్బందికి అనుకూలమైన రిపోర్టుకు లంచం డిమాండ్..
. రూ.7 లక్షలు డిమాండ్ చేయగా.. రూ.5 లక్షలకు కుదిరిన బేరం..
. రూ.2 లక్షల మొదటి విడత నగదు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు..
Mancherial : డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్ అధికారి లంచం (Corruption)తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) (Anti-corruption Department)అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాలలోని డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్ కార్యాలయంలో డిప్యూటీ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న రాథోడ్ బిక్కు (Rathod Bhikkhu)వద్దకు ఆశాఖలో ఇటీవల సస్పెండ్ అయిన వ్యక్తి వచ్చాడు. తనను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు కమిటీకి అనుకూల నివేదిక ఇవ్వడం, పెండింగ్‌లో ఉన్న జీతాల బిల్లింగ్, పెరిగిన జీతాల అమలు, సస్పెన్షన్ కాలానికి సంబంధించిన అలవెన్సులు చెల్లించడం, విచారణ నివేదికపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఉండటం వంటి నాలుగు పనులు చేసి పెట్టాలని కోరాడు.
రాథోడ్ బిక్కు అందుకు రూ.7 లక్షలు డిమాండ్ చేశాడు. చివరకు బేరం రూ.5 లక్షల వద్ద ఆగింది. ఫిర్యాదు దారుడు మొదటి విడతలో రూ.2 లక్షలు ఇస్తానని ఒప్పుకున్నాడు. ఫిర్యాదుదారుడి నుంచి శనివారం రాథోడ్ బిక్కు రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.2 లక్షల స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి కరీంనగర్‌లోని స్పెషల్ జడ్జ్ ఫర్ ఎస్పీఈ అండ్ ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచారు. అధికారులు ఎవరైనా లంచం అడిగితే 1064కు లేదా వాట్సాప్ 94404 46106కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు.
