ఒకటి.. రెండు.. మూడు సీతాకోకచిలుకలు (Colorful Butterflies) మన కళ్లముందు కదిలితే మన మనసు ఎంత పరవశిస్తుంది.. ఆనందం కలుగుతుంది. అలాంటిది వేలకు వేల సీతాకోకచిలుకలు మన కళ్లుముందు తారాడుతూ కనిపిస్తే.. ఎలా ఉంటుంది? అసలా ఊహే అద్భుతం కదూ.. మరి అలాంటి అద్భుతాన్ని చూడాలంటే కేరళలోని కన్నూరు అరలం అభయారణ్యాని (Aralam Wild life Sanctuary)కి వెళ్లాల్సిందే.
అక్కడి పశ్చిమ కనుమలు వన్యప్రాణుల (Wild Animals) కు ఆలవాలం.. పులులు, ఏనుగులతో పాటు ఇతర జీవాల మనుగడకు అది అనువైన చోటు. వీటితో పాటు దేశంలో లేని ఎక్కడా లేని విధంగా 266 రకాల సీతాకోకచిలుకల జాతులు (Hundreds of Species)ఆవాసం చేసుకున్నాయని పరిశోధకులు గుర్తించారు. అందుకే ఈనెల 18న కేరళ ప్రభుత్వం ఆ అటవీ ప్రాంతాన్ని ‘అరలం సీతాకోకచిలుక అభయారణ్యం’గా అధికారికంగా ప్రకటించింది.
ఇది భారతదేశంలోని మొట్టమొదటి సీతాకోకచిలుకల అభయారణ్యం. అరలం ప్రాంతానికి ‘సీతాకోక చిలుకల అభయారణ్యం’గా గుర్తింపు తీసుకురావడానికి పాతికేళ్ల నుంచి శాస్త్రవేత్తలు, పరిశోధకులు, అటవీశాఖ అధికారులు, ప్రకృతి ప్రేమికులు కృషి చేస్తున్నారు.
అరుదైన జాతులు..
అటవీ ప్రాంతం సాధారణమైన ఉష్ణమండలం, పాక్షిక సతత హరిత అడవి. 55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవి విస్తరించి ఉన్నది. కేరళలో కనిపించే మొత్తం సీతాకోక చిలుకల్లో 80శాతం అరలం ప్రాంతంలోనే ఉంటాయనే అతిశయోక్తి కాదు. 266 జాతుల్లో ఎన్నో జాతులు ప్రస్తుతం అంతరించిపోయే దశలో ఉన్నాయి. వాటిని కాపాడుకునేందుకు కేరళ ప్రభుత్వం కృషి చేస్తున్నది.
ప్రతి సంవత్సరం డిసెంబర్_ ఫిబ్రవరి మధ్య ఈ ప్రాంతం రంగు రంగుల సీతాకోక చిలుకల ఉరుకులు పరగులతో అందంగా కనిపిస్తుంది. కామన్ ఆల్బాట్రాస్, డానైన్ జాతులతో సహా వందలాది సీతాకోకచిలుకల జాతులు గాలిలో తేలియాడుతూ, రెక్కలాడిస్తూ సందడి చేస్తాయి. వీటిని చూసి మురిసిపోయేందుకు.. పరవశించేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తారు.
వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు ఇష్టంగా అడవిలో సంచరించి అరుదైన ఫొటోలు తీస్తారు.రాష్ట్ర అటవీశాఖ మలబార్ నేచురల్ హిస్టరీ సొసైటీ సాయంతో సీతాకోకచిలుకల మనుగడపై అధ్యయనం చేస్తున్నది. జీవ వైవిధ్యంలో సీతాకోకచిలుకల ప్రాధాన్యంపై, పూల మొక్కల్లో పరపరాగ సంపర్కంపై పరిశోధిస్తుంది.