రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్ర ఆర్థిక సంక్షోభం (Economical Crisis) తలెత్తిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Workng President) కేటీఆర్ (KTR) సోమవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. ఇటీవల విడుదలైన కాగ్ త్రైమాసిక నివేదిక (CAG Quarterly Report)ను ఉటంకిస్తూ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
ఆ నివేదిక ప్రకారం, రాష్ట్ర ఆదాయం (State Income) బాగా తగ్గిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇది రాష్ట్రానికి ప్రమాద ఘంటికలు మోగిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో రూ. 2,738 కోట్ల మిగులు ఉంటుందని అంచనా వేసినప్పటికీ, మొదటి త్రైమాసికానికే రూ. 10,583 కోట్ల రెవెన్యూ లోటు వచ్చిందని తెలిపారు. మూడు నెలల్లోనే ప్రభుత్వం రూ. 20,266 కోట్లు అప్పు చేసిందని వెల్లడించారు.
బడ్జెట్‌లో అంచనా వేసిన పన్నేతర ఆదాయంలో కేవలం 3.37 శాతం మాత్రమే వసూలు అయ్యిందని కేటీఆర్ తెలిపారు. ఒక్క రోడ్డు కూడా వేయలేదని, కొత్త ప్రాజెక్టులు కూడా కట్టలేదని ఆయన విమర్శించారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా, ప్రాజెక్టులు నిర్మించకుండా, విద్యార్థులకు మంచి భోజనం పెట్టకుండా అప్పులతో ఏం చేస్తున్నారని కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
గతంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ‘ఆటో పైలట్‌లో’ ఉందని గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ ఆర్థిక నిపుణులు ఈ పరిస్థితిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉందో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.