Shamshabad Airport: హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad Rajiv Gandhi International Airport)లో శుక్రవారం రాత్రి నుంచి విమానాల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకించి వియత్నాం వెళ్లాల్సిన విమానం నిరవధికంగా ఆలస్యమవడంతో సుమారు 200 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు. గంటల తరబడి వేచి చూసినప్పటికీ విమానం ఎప్పుడు బయలుదేరుతుందో అధికారుల నుంచి స్పష్టమైన సమాచారం అందకపోవడంతో వారు విమానాశ్రయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాశ్రయ ప్రాంగణంలో ప్రయాణికులు సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఘటనలు చోటుచేసుకున్నాయి. మాకు సరైన సమాధానం చెప్పడం లేదు. రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాం, ఆహారం, విశ్రాంతి సదుపాయాలు కూడా ఇవ్వడం లేదు అంటూ కొందరు ప్రయాణికులు మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, ఢిల్లీ, ముంబై, శివమొగ్గ దిశగా బయలుదేరాల్సిన ఇండిగో విమాన సర్వీసులను కూడా అధికారులు రద్దు చేశారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో 6E051 విమానం, ముంబైకి వెళ్లాల్సిన 6E245 సర్వీస్, అలాగే శివమొగ్గకు వెళ్లాల్సిన 6E51 ఫ్లైట్‌లు రద్దు అయినట్లు ప్రకటించారు. ఈ అకస్మాత్తు నిర్ణయంపై ప్రయాణికులు మండిపడ్డారు. తమ ప్రయాణ ప్రణాళికలు దెబ్బతిన్నాయని, టికెట్లకు రిఫండ్ లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై స్పష్టత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం ఢిల్లీ విమానాశ్రయంలో ఏర్పడిన సాంకేతిక సమస్యల వల్ల దేశవ్యాప్తంగా అనేక విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆ ప్రభావం హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంపైనా పడిందని వారు తెలిపారు. కొంతకాలం పాటు అన్ని ఎయిర్‌లైన్స్ షెడ్యూల్‌లు మార్పులకు గురయ్యాయని, పరిస్థితిని సాధారణం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.
అదే సమయంలో, హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్లాల్సిన ఎయిర్ ఏషియా ఫ్లైట్ (68) లో కూడా సాంకేతిక లోపం తలెత్తింది. వియత్నాం ఎయిర్‌లైన్స్ వన్984 సర్వీస్ కూడా ఇంజిన్ సమస్య కారణంగా ఆలస్యమవుతోంది. అలాగే, సిబ్బంది ఆలస్యంగా రావడంతో గోవా వెళ్లాల్సిన ఇండిగో 6I532 ఫ్లైట్ షెడ్యూల్ కూడా వెనక్కి జరగింది. అంతా కలిపి, శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం ఉదయం వరకు తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రయాణికులు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ నిరసనలు తెలిపారు. ఈ సంఘటన నేపథ్యంలో విమానాశ్రయ సిబ్బంది, ఎయిర్‌లైన్ అధికారులు కలిసి ప్రయాణికులను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు. పరిస్థితి త్వరలోనే సాధారణం అవుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు.
A #Vietnam-bound #flight that was supposed to depart from #Shamshabad at 11 pm last night hasn’t taken off even after several hours.
Over 200 passengers have been stranded through the night, with no clarity from Vietnam Airlines staff about the delay or new… pic.twitter.com/i4Ct4xvFA4
— NewsMeter (@NewsMeter_In) November 8, 2025
