Telangana : తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారిన ఫార్ములా–ఈ కారు రేసు (Formula-E Car Race)నిధుల దుర్వినియోగ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR)పై అధికారిక విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక శాఖ (ACB) అనుమతి కోరుతూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపిన ఫైల్‌పై గవర్నర్ చివరికి సంతకం చేశారు. సెప్టెంబర్ 9న రాజ్‌భవన్‌కు వెళ్లిన ఈ ఫైల్‌పై న్యాయ నిపుణుల అభిప్రాయాలను పరిశీలించిన అనంతరం గురువారం ఉదయం గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఈ నిర్ణయంతో కేసు పునరుద్ధరణకు దారులు తెరుచుకోగా, కేటీఆర్‌తో పాటు ఈ అంశంలో పేరున్న ఇతర అధికారులపై దర్యాప్తు మరింత వేగంగా సాగనుంది.
మాజీ HMDA చీఫ్ ఇంజినీర్ (ప్రాజెక్ట్స్) బీఎల్వీ రెడ్డి, మాజీ ప్రత్యేక అధికారిగా పనిచేసిన కిరణ్‌కుమార్‌లపై కూడా చార్జ్‌షీట్ త్వరలో దాఖలు చేయనున్నట్లు సమాచారం. అంతేకాక, ఈ వ్యవహారానికి సంబంధించి ఇద్దరు సిట్టింగ్ ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్, శివశంకర్‌లపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే ప్రాసిక్యూషన్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కేసు మరింత వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గమనించదగ్గ విషయం ఏమిటంటే, 2023 ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ–ప్రిక్స్ రేసుకు సంబంధించి ఏస్ ఆటోమొబైల్స్ (గ్రింకో గ్రూప్)తో ఎలాంటి అధికారిక ఒప్పందం లేకుండానే రూ.54.88 కోట్లను విడుదల చేసినట్లు ACB ఆరోపిస్తోంది.
ఈ మొత్తాలు ఆర్థిక శాఖ మరియు రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండానే విదేశీ సంస్థ ‘ఫార్ములా–ఈ ఆపరేషన్స్’కు బదిలీ చేయబడ్డాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. HMDA, గ్రీన్‌కో, ఫార్ములా ఈ మధ్య జరిగిన రహస్య ఒప్పందాలు కూడా ఈ దర్యాప్తులో కీలకాంశాలుగా మారాయి. ఈ కేసు మరోసారి తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా నిలిచింది. బీఆర్ఎస్ నాయకత్వం చేపట్టిన ఈ అంతర్జాతీయ రేసింగ్ ఈవెంట్ చుట్టూ తిరుగుతున్న ఆర్థిక అవకతవకల ఆరోపణలు మళ్లీ వెలుగులోకి రావడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గవర్నర్ ఆమోదం రావడంతో కేటీఆర్‌పై చట్టపరమైన చర్యలకు మార్గం సుగమమైంది. రాబోయే రోజుల్లో ఏసీబీ చేపట్టే దర్యాప్తు రాష్ట్ర రాజకీయ సమీకరణలపై ఎలా ప్రభావం చూపుతుందన్న ఆసక్తి పెరుగుతోంది.
