end
=
Thursday, January 15, 2026
రాజకీయంఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్.. 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా: సజ్జనార్‌
- Advertisment -

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్.. 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా: సజ్జనార్‌

- Advertisment -
- Advertisment -

Sajjanar: తెలుగు సినీ పరిశ్రమను దెబ్బతీస్తున్న ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ (iBomma) కేసులో కీలక నిందితుడు ఇమ్మడి రవి(Immidi Ravi)ని హైదరాబాదు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని నగర పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ ప్రకటించారు. పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగించిన ఈ నెట్‌వర్క్‌పై దర్యాప్తు సాగిస్తున్న సందర్భంలో, రవిని అరెస్ట్ చేయడం పెద్ద ముందడుగుగా చూస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన పలు కీలక వివరాలను సీపీ మీడియా సమావేశంలో బయటపెట్టారు. ఈ రోజు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ప్రత్యేక సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, ఎస్‌.ఎస్‌. రాజమౌళి, ప్రముఖ నిర్మాత దిల్ రాజు తదితరులు సీపీ సజ్జనార్‌ను కలిసి, ఈ అరెస్ట్‌ను సాధించిన సైబర్ క్రైమ్ బృందాన్ని అభినందించారు. పైరసీ వల్ల నిరంతరం నష్టపోతున్న సినీ రంగం తరఫున ఇది ముఖ్య విజయంగా వారు అభిప్రాయపడ్డారు.

మీడియాతో సీపీ సజ్జనార్ మాట్లాడుతూ..భారత్‌లోని సినీ పరిశ్రమ మొత్తం పైరసీ కారణంగా తీవ్రంగా దెబ్బతింటోందని, దాన్ని అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. “ఇమ్మడి రవిని చివరకు పట్టుకోగలిగాం. బాలీవుడ్‌, టాలీవుడ్‌కు చెందిన వేల సంఖ్యలో సినిమాలను అక్రమంగా అప్‌లోడ్ చేసి, సుమారు రూ. 20 కోట్ల అక్రమ ఆదాయం పొందినట్టు రవి విచారణలో వెల్లడించాడు. అతని వద్ద నుండి రూ. 3 కోట్లు స్వాధీనం చేసుకున్నాం” అని వివరించారు. రవికి దాదాపు 50 లక్షల మంది వినియోగదారుల డేటా ఉన్నట్లు, ఈ సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నందున జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా, పైరసీ వెబ్‌సైట్‌లను కవర్‌గా ఉపయోగించి బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు, దీంతో అనేక యువకులు ఆర్థికంగా, మానసికంగా దెబ్బతిన్నారని వ్యాఖ్యానించారు. ఒక సైట్ బ్లాక్ చేస్తే వెంటనే మరోదాన్ని సృష్టిస్తూ, రవి మొత్తం 65 మిర్రర్ వెబ్‌సైట్‌లు నడిపినట్లు విచారణలో బయటపడిందని తెలిపారు.

ఇమ్మడి రవికి ముందే నేర చరిత్ర ఉన్నట్లు కూడా సజ్జనార్ వెల్లడించారు. మహారాష్ట్రలో ప్రహ్లాద్ అనే తప్పుడు పేరుతో నకిలీ డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు తయారు చేసుకున్నాడని చెప్పారు. అతను కరేబియన్ దీవుల్లో పౌరసత్వం పొందిననుంచి, అమెరికా మరియు నెదర్లాండ్స్ దేశాల్లో సర్వర్లను ఏర్పాటు చేసి తన పైరసీ నెట్‌వర్క్‌ను నిర్వహించాడని వివరించారు. ఈ కేసులో ఇప్పటికే దుద్దెల శివరాజ్, ప్రశాంత్ అనే ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు, రవిపై ఐటీ చట్టం, కాపీరైట్ చట్టం కింద ఐదు కేసులు నమోదు చేసినట్లు సీపీ వెల్లడించారు. పైరసీపై కఠిన చర్యలు కొనసాగుతాయని, పరిశ్రమకు న్యాయం చేయడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -