Bihar Elections: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేడి చర్చలు ముదురుతున్న వేళ, జన్ సురాజ్ పార్టీ (Jan Suraaj Party) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor)కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీకి 150 కంటే ఎక్కువ సీట్లు రావచ్చని, అదే సమయంలో ప్రజలు తిరస్కరిస్తే 10 కంటే తక్కువ సీట్లకే పరిమితమవుతామని స్పష్టంగా చెప్పారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన రాజకీయ విశ్లేషణను వివరించారు. ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ..బిహార్ ప్రజలు జన్ సురాజ్‌ను ప్రత్యామ్నాయంగా చూడడం ప్రారంభించారు. కానీ సంవత్సరాలుగా నిరాశ అనుభవించిన ఓటర్లు కొత్త మార్పు కోసం విశ్వాసం చూపించాలి. ప్రజల మద్దతు మాకు వస్తే బిహార్ రాజకీయాల్లో కొత్త దశ మొదలవుతుంది అన్నారు. తాను ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేస్తానని ఎక్కడా ధృవీకరించలేదని స్పష్టం చేస్తూ ఒకవేళ నేను పోటీ చేస్తే కర్గాహర్ నియోజకవర్గం నుంచే బరిలోకి దిగుతాను. కానీ నేను ఎక్స్ ఫ్యాక్టర్ కాదు, జన్ సురాజ్ ఆలోచన మాత్రమే ప్రజల హృదయాల్లో మార్పు తీసుకురాగలదు అని అన్నారు.
ఎన్నికల ఫలితాలపై ఆయన వ్యాఖ్యానిస్తూ..ఫలితాలు నవంబర్ 14న వెలువడతాయి. ఆ రోజున ప్రజలు జన్ సురాజ్ గెలిచిన సీట్ల సంఖ్యను చూస్తారా, లేక నేను పోటీ చేశానా అనే విషయాన్ని పరిశీలిస్తారా? అనేది చూడాలి. ప్రస్తుతం బిహార్‌లో మహాగఠ్‌బంధన్ (Mahagathbandhan) మరియు ఎన్డీయే (NDA)కి ప్రత్యామ్నాయం లేదనే భావన ఉంది. కానీ వాస్తవ పరిస్థితి వేరు. బిహార్‌లో మూడింట ఒక వంతు మంది ఓటర్లు ఈ రెండు కూటములకు ఓటు వేయాలని అనుకోవడం లేదు అని వివరించారు. జన్ సురాజ్ పార్టీ సుమారు 160 నుండి 170 సీట్లలో గట్టి పోటీ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. పొత్తుల విషయంపై ప్రశాంత్ కిశోర్ స్పష్టమైన ప్రకటన చేశారు. “ఈ ఎన్నికల తర్వాత జన్ సురాజ్ కింగ్ మేకర్‌గా ఎదిగినా, మేము ఎలాంటి రాజకీయ పొత్తులు పెట్టుకోం. ప్రజలు మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వకపోతే కూడా మా పని కొనసాగిస్తాం. ఇది నేను ఇప్పుడే రాసిపెడతాను. ఎన్నికల ముందు కానీ, తర్వాత కానీ ఎలాంటి పొత్తులు ఉండవు, అని ఆయన తేల్చిచెప్పారు.
అదే సమయంలో ఆయన విమర్శిస్తూ ఒకవేళ హంగ్ అసెంబ్లీ పరిస్థితి వస్తే, కొన్ని పార్టీ నేతలు తమ స్థానాలు మారుస్తారు. డబ్బు, కేసుల భయం లేదా రాజకీయ ఒత్తిళ్లు అందుకు కారణం కావొచ్చు. కానీ జన్ సురాజ్ అలాంటి రాజకీయాల్లో పాల్గొనదు అని అన్నారు. బిహార్‌లో ఈసారి ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయి. నవంబర్ 6 మరియు 11 తేదీల్లో పోలింగ్ జరుగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. బిహార్ రాజకీయ సమీకరణాలను మార్చే శక్తిగా జన్ సురాజ్ పార్టీ నిలుస్తుందా లేదా అన్నది ఆ ఫలితాలపై ఆధారపడి ఉంది.
