-202 పరుగులకే పరిమితమైన ఆస్ట్రేలియా
-రాణించిన పాండ్యా, కెప్టెన్ కోహ్లి
-బౌలింగ్‌లో ఆకట్టుకున్న షార్దూల్, నటరాజన్, బుమ్రా
కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ వన్డేలో టీమిండియా విజయం సాధించింది. వరుసగా రెండు వన్డేలో ఓడి వన్డే సిరీస్‌ను చేజార్చుకున్న టీమిండియా మూడో వన్డేలో గెలిచి పరువు నిలుపుకుంది. ఆసీస్‌పై 13 పరుగుల తేడాతో టీమిండియా గెలుపును సొంతం చేసుకుంది. టీమిండియా నిర్దేశించిన 303 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా విఫలమైంది. టాప్ ఆర్డర్‌లో కెప్టెన్ ఫించ్ తప్ప మిగిలిన బ్యాట్స్‌మెన్స్ రాణించకపోవడం ఆస్ట్రేలియా ఓటమికి ప్రధాన కారణంగా చెప్పక తప్పదు. ఫించ్ 82 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్స్‌లతో 75 పరుగులతో రాణించాడు. చజడేజా బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్‌గా చిక్కి ఫించ్ వెనుదిరిగాడు. రెండు వన్డేల్లో రాణించిన స్మిత్ ఫైనల్ వన్డేలో మాత్రం ఏడు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద శార్దూల్ బౌలింగ్‌లో కీపర్ రాహుల్‌కు క్యాచ్‌గా చిక్కి పెవిలియన్ బాట పట్టాడు. లబుషేన్ 7 పరుగులకే నటరాజన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. హెన్రిక్స్ 22 పరుగులు, కామెరున్ గ్రీన్ 21 పరుగులకే ఔటయ్యారు. అలెక్స్ క్యారీ, మ్యాక్స్‌వెల్ కలిసి నిలకడగా ఆడటంతో కంగారూ జట్టు గెలుపుపై ఆసీస్ ఫ్యాన్స్‌కు ఆశలు చిగురించినప్పటికీ.. మ్యాక్స్‌వెల్‌ను బూమ్రా క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆసీస్ ఓటమి ఖాయమైంది. మ్యాక్స్‌వెల్ 37 బంతుల్లో 59 పరుగులు చేశాడు.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 26 పరుగుల వద్ద ధావన్ వికెట్‌ను కోల్పోయింది. 27 బంతుల్లో 16 పరుగులు చేసిన ధావన్.. సీన్ అబాట్ బౌలింగ్‌లో అగర్‌కు క్యాచ్‌గా చిక్కి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. అగర్ బౌలింగ్‌లో 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ బాట పట్టాడు. కెప్టెన్ కోహ్లీ 63 పరుగులతో మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. హజల్‌వుడ్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్‌గా చిక్కి కోహ్లీ ఔటయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జంపా బౌలింగ్‌లో లబుషేన్‌కు క్యాచ్‌గా చిక్కి వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ (5 పరుగులు) అగర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ బాట పట్టాడు.
అయితే.. 152 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియాకు హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఊపిరి పోశారని చెప్పక తప్పదు. మరో వికెట్ చేజారకుండా కంగారూ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పరుగులు రాబట్టారు. హార్థిక్ పాండ్యా 76 బంతుల్లో ఒక సిక్స్, ఏడు ఫోర్లతో 92 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. రవీంద్ర జడేజా మూడు సిక్స్‌లు, ఐదు ఫోర్లతో 50 బంతుల్లో 66 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. జడేజా, పాండ్యా భాగస్వామ్యంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేయగలిగింది. ఆసీస్ ముందు 303 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది.
ఆసీస్ బౌలర్లలో అగర్ రెండు వికెట్లతో రాణించగా, జంపా, సీన్ అబాట్, హజల్‌వుడ్‌కు తలో వికెట్ దక్కింది. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లతో సత్తా చాటగా, నటరాజన్, బూమ్రా చెరో రెండు వికెట్లు తీశారు. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాకు తలో వికెట్ దక్కింది. టీమిండియా బౌలింగ్‌పరంగా చేసిన మార్పులు విజయంలో కీలక పాత్ర పోషించాయి. చాహల్ స్థానంలో వచ్చిన కుల్దీప్ ఒక వికెట్ దక్కించుకోగా, నటరాజన్ రెండు వికెట్లు, శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లతో రాణించడం గమనార్హం.
కాగా, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించన ఇండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికవగా, ఆసీస్ జట్టు సిరీస్ గెలవడంలో తన బ్యాట్ పవర్ చూపిన స్టీవ్ స్మిత్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. మూడు వన్డేల సిరీస్‌లో స్మిత్ రెండు ఫాస్టెస్ట్ సెంచరీలు నమోదు చేయడం గమనర్హం.