end
=
Tuesday, January 21, 2025
వార్తలురాష్ట్రీయంసిరిసిల్లలో ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ స్కూల్‌ రెడీ..
- Advertisment -

సిరిసిల్లలో ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ స్కూల్‌ రెడీ..

- Advertisment -
- Advertisment -
  • ఐడీటీఆర్‌.. రాష్ర్టానికే మణిహారం
  • సిరిసిల్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమైన డ్రైవింగ్‌ శిక్షణ, పరిశోధన కేంద్రం
  • తెలంగాణలోనే తొలి సెంటర్‌గా ఖ్యాతి
  • మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో ఏర్పాటు
  • 20 కోట్లతో నాలుగేండ్లలోనే పూర్తి
  • మండెపల్లి శివారులో 20 ఎకరాల స్థలంలో నిర్మాణం
  • అత్యున్నత ప్రమాణాలు, సూపర్‌ టెక్నాలజీతో ట్రైనింగ్‌
    నెలకు 400 మందికిపైగా తర్ఫీదుకు అవకాశం
  • త్వరలోనే ప్రారంభోత్సవం

విశాలమైన ట్రాకులు, ఆధునిక టెక్నాలజీతో కూడిన వాహనాలు, 30 మంది ప్రత్యేక నిపుణులు, డ్రైవింగే కాదు సంపూర్ణ అవగాహనకు తీరుకో వాహనం విడిభాగాలు, అత్యున్నత ప్రమాణాలు.. సువిశాలమైన అతి పెద్ద భవనం, విశాలమైన గదులు.. ఇలా సకల వసతులతో సిరిసిల్లలో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రైవింగ్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (ఐడీటీఆర్‌) శిక్షణ కేంద్రం రెడీ అయింది. దక్షిణ భారతంలో నాలుగోదిగా.. రాష్ట్రంలోనే మొదటి సెంటర్‌గా ఖ్యాతి గడిస్తున్న ఈ సెంటర్‌ తెలంగాణకే మణిహారంగా నిలువబోతున్నది. మంత్రి కేటీఆర్‌ చొరవతో తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులో 20 ఎకరాల స్థలంలో 20 కోట్లతో నాలుగేండ్లలోనే ఆవిష్కృతమై, ప్రారంభోత్సవానికి మస్తాబవుతున్నది. త్వరలోనే అందుబాటులోకి రాబోతుండగా, జిల్లాలోనేకాదు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది యువతకు సాంకేతికతో కూడిన శిక్షణ అందబోతున్నది. నెలకు 400 మందికి పైగా.. ఏడాదికి దాదాపు 5వేల మందికి తర్ఫీదు ఇవ్వనుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.

మన రాష్ట్రం నుంచి, మరీ ముఖ్యంగా ఉమ్మడి జిల్లా నుంచి చాలా మంది నిరుద్యోగ యువకులు ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్తున్నారు. అక్కడ డ్రైవర్లకు డిమాండ్‌ ఉండడంతోపాటు ఆ స్థాయిలో డ్రైవింగ్‌ శిక్షణ పొందే సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో జిల్లాతోపాటు రాష్ట్రంలోని యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన డ్రైవింగ్‌ శిక్షణ అందించి, ఉపాధి చూపాలని మంత్రి కేటీఆర్‌ సంకల్పించారు. ఆ మేరకు ప్రత్యేక చొరవ తీసుకొని నాలుగేళ్ల కింద రాష్ట్రంలోనే తొలి అంతర్జాతీయ స్థాయి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రైవింగ్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (ఐడీటీఆర్‌)ను మంజూరు చేయించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులోని 2016 మే 17న పనులు ప్రారంభించారు. 20 ఎకరాల స్థలంలో విశాలమైన స్థలంలో 20కోట్లతో నాలుగేండ్లలోనే పూర్తి కాగా, ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ సెంటర్‌ అశోక్‌ లేలాండ్‌ సంస్థతోపాటు పలు ప్రైవేట్‌ సంస్థల నిర్వహణలో కొనసాగనున్నది. మూడు డ్రైవింగ్‌ సిమ్యులేటర్స్‌తో శిక్షణ.. హెవీ, లైట్‌, మీడియం వాహనాల శిక్షణలో భాగంగా సెంటర్‌లో మూడు ఆధునిక డ్రైవింగ్‌ సిమ్యులేటర్‌ వాహనాలు అందుబాటులో ఉంచారు. ఇందులో ఒకటి హెవీ సిమ్యులేటర్‌ కాగా, రెండు లైట్‌ సిమ్యులేటర్లు ఉన్నాయి. ఇవి ఇండోర్‌ శిక్షణ వాహనాలు. వీటిలో త్రీడీ తెర ఉంటుంది. ఇందులో కూర్చుని శిక్షణ తీసుకునేవాళ్లు బయట రోడ్డు మీద వెళ్లినట్లే ఫీలవుతారు. సిగ్నల్‌, డ్రైవింగ్‌ తీరు, వేగ నియంత్రణతోపాటు ఇతర నిబంధనలపై కొన్నిరోజులు శిక్షణ ఇచ్చి, తర్వాత ట్రాకులపై ఇస్తారు. ఆధునిక ప్రమాణాలు.. ఐడీటీఆర్‌లో ఆధునిక వసతులు కల్పించారు.

విశాలమైన స్థలంలో భవనాన్ని జీ+2 లో పద్ధతిలో నిర్మించారు. మూడు బ్లాకులుగా విభజించారు. మెయిన్‌బ్లాక్‌లో ఆరు క్లాస్‌ రూంలు ఏర్పాటు చేశారు. అలాగే అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌తోపాటు వర్క్‌షాప్‌ కోసం ప్రత్యేక బ్లాకు, శిక్షణ తీసుకునే వారికి వసతి కోసం ప్రత్యేక గదులు నిర్మించారు. భవనం బయట అత్యంత ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో 3.25 కిలోమీటర్ల మేర విశాలమైన ట్రాక్స్‌ నిర్మించారు. వీటిలో ఫోర్‌లేన్‌, సిక్స్‌ లేన్‌ ట్రాకులు కూడా ఉన్నాయి. ఇక భవనం చుట్టూ కంపౌండ్‌ వాల్‌, ఎంట్రెన్స్‌ వద్ద భారీ గేటు ఏర్పాటు చేశారు. అలాగే ఇందులో యువతకు శిక్షణ కోసం 5 రకాల వాహనాలు, 3 డ్రైవింగ్‌ సిమ్యులేటర్లు అందుబాటులో ఉంచారు.

కాగా, ఇక్కడ 180 మందికి వసతితో కూడిన శిక్షణ ఇవ్వనున్నారు. వసతి గృహంలో ఉండేవారికి డే స్కాలర్‌ కింద మరో 220 మందికిపైగా తర్ఫీదు ఇచ్చే అవకాశం ఉంటుంది. నెలకు 400 మందికి అంటే ఏడాదిలో 5 వేల మందికి శిక్షణ అవకాశం ఉన్నది. తెలంగాణలో మొదటిది.. దేశంలో పదకొండవది.. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ఐడీటీఆర్‌ తెలంగాణలో ఏకైక శిక్షణ కేంద్రంగా గుర్తింపు పొందింది. ఇప్పటివరకు దేశంలోనే 10 కేంద్రాలు ఉండగా, దక్షిణ భారతదేశంలో తమిళనాడులో ఒకటి, కర్ణాటకలో 2 కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో తొలిసారి అదీ సిరిసిల్లలో ఏర్పాటు చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు.

ప్రారంభానికి సిద్ధం చేశాం..

సకల వసతులు.. అత్యున్నత ప్రమాణాలతో సిరిసిల్లలో నిర్మించిన ఐడీటీఆర్‌ ప్రారంభోత్సవానికి సిద్ధం చేశాం. తెలంగాణలోనే తొలి శిక్షణ కేంద్రం ఇది. మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో నాలుగేండ్లలోనే నిర్మించాం. ఈ కేంద్రం ద్వారా నాణ్యమైన డ్రైవర్లను అందించవచ్చు. ఉపాధి అవకాశాలు ఎక్కువ. శిక్షణ కేంద్రంలో డ్రైవింగ్‌ శిక్షణ పొందిన వారికి బయట దేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. రోడ్డు ప్రమాదాల నివారణతోపాటు ప్రమాదాలు తగ్గుతాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు శిక్షణ పొందవచ్చు. శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన మంత్రి కేటీఆర్‌, భవనం నిర్మాణం పూర్తికి సహకరించిన అధికారులు, అశోక్‌ లే లాండ్‌ సంస్థ ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు. -కొండల్‌రావు, జిల్లా రవాణా శాఖ అధికారి(రాజన్న సిరిసిల్ల)

అత్యాధునిక టెక్నాలజీ..

ఈ సెంటర్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన శిక్షణ అందుతుంది. 30 మంది అనుభవజ్ఞులైన శిక్షకులతో అన్ని రకాల డ్రైవింగ్‌లలో తర్ఫీదు ఇస్తారు. ఒకరోజు డ్రైవింగ్‌ కోర్సు శిక్షణతోపాటు ఎల్‌ఎంవీ, హెచ్‌ఎంఎల్‌, ట్యాంకర్స్‌, అంబులెన్స్‌, అత్యవసర సేవలకు వినియోగించే వాహనాల దాకా శిక్షణ అందిస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత లైసెన్స్‌తోపాటు ధ్రువీకరణ పత్రాలను అందిస్తారు. రోడ్డు ప్రమాదాల నివారణతోపాటు నాణ్యమైన డ్రైవింగ్‌ శిక్షణను అంతర్జాతీయ ప్రమాణాలతో అందిస్తారు. శిక్షణ తీరు ఇలా.. మొదట నాలుగు కోర్సులు ప్రవేశపెట్టనున్నారు. హెవీ, లైట్‌, మీడియం వాహనాల డ్రైవింగ్‌ శిక్షణను అందించి 30 రోజుల్లోనే పూర్తిచేస్తారు. సాధారణ డ్రైవింగ్‌ స్కూల్‌లో మామూలు వాహనాలపై అందిస్తారు.

కానీ, ఇక్కడ మాత్రం కచ్చితమైన శిక్షణ ఉంటుంది. నెల రోజులపాటు ప్రయోగపూర్వకంగా ట్రైనింగ్‌ అందిస్తారు. వర్క్‌షాప్‌లో వాహనాల పనితీరుతోపాటు వాహనాల విడి భాగాలపై అవగాహన కల్పిస్తారు. శిక్షణ పూర్తికాగానే సర్టిఫికెట్‌ అందిస్తారు. దీంతో పాటు రిఫ్రెషర్స్‌ విభాగంలో పాత డ్రైవర్లు, లైసెన్స్‌ ఉన్న డ్రైవర్లకు ఒకరోజు శిక్షణ ఇస్తారు. శిక్షణలో వాహనాన్ని నడిపే విధానాన్ని పరిశీలించి ఫిట్‌ లేదా అన్‌ఫిట్‌గా తేల్చుతారు. ఫిట్‌ అయితే ధ్రువీకరణతోపాటు లైసెన్స్‌ అందిస్తారు. ప్రత్యేకతలు 20 ఎకరాల్లో డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రం 180 మందికి హాస్టల్‌ వసతి డే స్కాలర్‌ కింద మరో 220 మందికి ఇస్తారు అన్ని ట్రాకుల పొడవు 3.25 కిలోమీటర్లు నాలుగు వరుసలు, ఆరు వరుసలతో ఏర్పాటు చిన్న వాహనం నుంచి హెవీ వాహనాలు, అత్యవససర సమయాల్లో వినియోగించే వాహన డ్రైవింగ్‌పై కూడా శిక్షణ ఇస్తారు. వర్క్‌షాప్‌, ల్యాబ్‌లు, క్లాస్‌లు ఉన్నాయి. హెవీ, లైట్‌, మీడియం వెహికల్‌ డ్రైవింగ్‌ శిక్షణను నెల రోజుల్లోనే పూర్తిచేస్తారు.

పాత డ్రైవర్లు, హెవీ లైసెన్స్‌ దారులకు ఒకరోజు రిఫ్రెషింగ్‌ కోర్సుతో కూడిన శిక్షణ అందిస్తారు.
వాహనాల విడివిభాగాలు, పనితీరుపై ప్రత్యేకమైన అవగాహన, ప్రయోగపూర్వకంగా శిక్షణ సాంకేతికతతో కూడిన 3 డ్రైవింగ్‌ సిమ్యులేటర్స్‌ అందుబాటులో ఉంచారు. వీటిలో ఒకటి హెవీ, రెండు లైట్‌ సిమ్యులేటర్లు ఉన్నాయి. వీటిపై ప్రత్యేకంగా శిక్షణ అందిస్తారు. మెడికల్‌ వ్యాన్‌లో ఫస్ట్‌ ఎయిడ్‌ చికిత్స విభాగంపై అవగాహన శిక్షణ పూర్తయిన వారికి వెంటనే సర్టిఫికెట్‌, లైసెన్స్‌లు అందిస్తారు. ఇందులో శిక్షణ పూర్తి చేసుకున్న డైవర్లకు జాతీయ, అంతర్జాతీయంగా భారీ వేతనంతో కూడిన ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -