end
=
Tuesday, November 18, 2025
వార్తలురాష్ట్రీయంయూఏఈ పర్యటనతో పెట్టుబడుల వర్షం..ఏపీకి క్యూ కట్టనున్న అరబ్ కంపెనీలు
- Advertisment -

యూఏఈ పర్యటనతో పెట్టుబడుల వర్షం..ఏపీకి క్యూ కట్టనున్న అరబ్ కంపెనీలు

- Advertisment -
- Advertisment -

 

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి (AP)పెట్టుబడులు రప్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) చేసిన యూఏఈ పర్యటన(UAE tour)విశేష ఫలితాలను ఇచ్చింది. మూడు రోజుల పర్యటన అనంతరం ఆయన బృందం విజయవంతంగా రాష్ట్రానికి తిరిగి వచ్చింది. ఈ పర్యటనలో పలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు గాఢ ఆసక్తి వ్యక్తం చేశాయి. రాష్ట్రంలోని అపార అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించిన చంద్రబాబు, ఏపీలో పెట్టుబడుల కోసం అనుకూల వాతావరణం ఉందని తెలియజేశారు. చంద్రబాబుతో సమావేశమైన పలు అంతర్జాతీయ సంస్థల అధినేతలు తమ పెట్టుబడి ప్రణాళికలను పంచుకున్నారు. రియల్ ఎస్టేట్, మౌలిక వసతుల అభివృద్ధిలో ఆసక్తి చూపిన శోభా గ్రూప్, అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రంథాలయం నిర్మాణానికి రూ.100 కోట్లు విరాళం ప్రకటించింది. దుగరాజపట్నం వద్ద షిప్ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటు కోసం ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ ముందుకు రాగా, లాజిస్టిక్స్ పార్కులు, గిడ్డంగుల ఏర్పాటు కోసం షరాఫ్ గ్రూప్ హామీ ఇచ్చింది. వైద్య రంగంలో పెట్టుబడులకు బుర్జిల్ హెల్త్‌కేర్ సంస్థ ఆసక్తి చూపగా, ఏఐ డేటా సెంటర్లు, స్మార్ట్ గవర్నెన్స్ టెక్నాలజీ అభివృద్ధిపై జీ42 కంపెనీ సానుకూలత వ్యక్తం చేసింది.

తన పర్యటనలో చంద్రబాబు సుమారు 25 కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్రంలోని విభిన్న ప్రాంతాల సామర్థ్యాలను ప్రదర్శించారు. ఉత్తరాంధ్రలో ఐటీ, ఏఐ, గ్రీన్ ఎనర్జీ రంగాలపై ప్రాధాన్యం ఇవ్వడం, విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ కోసం 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి రానున్నట్టు వెల్లడించారు. రాయలసీమలో పునరుత్పాదక ఇంధనం, ఏరోస్పేస్, సెమీ కండక్టర్ రంగాల అవకాశాలను వివరించగా, గోదావరి జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా, టూరిజం రంగాలు వేగంగా ఎదుగుతున్నాయని చెప్పారు. అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీ ఏర్పాటు జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ద్వారా పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు ఇస్తున్నామని, అవసరమైతే విధానాల్లో మార్పులు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో యూఏఈ విదేశీ వాణిజ్య మంత్రి థానీ బిన్ అహ్మద్, ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్‌లతో ఆయన బృందం సమావేశమై, ఏపీలో పెట్టుబడులపై సంభాషించింది. ఏపీలో పెట్టుబడి అవకాశాలను పరిశీలించేందుకు తమ బృందాన్ని త్వరలో పంపిస్తామని యూఏఈ మంత్రులు హామీ ఇచ్చారు.

దుబాయ్‌లో జరిగిన తెలుగు డయాస్పోరా కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. పది గల్ఫ్ దేశాల నుంచి వేలాదిగా తెలుగువారు పాల్గొని రాష్ట్రాభివృద్ధి పట్ల ఉత్సాహం చూపారు. ఈ సందర్భంగా భారత కాన్సుల్ జనరల్ సతీశ్ కుమార్ శివన్ మాట్లాడుతూ, “కియా మోటార్స్ కోసం చంద్రబాబు చేసిన కృషిని ప్రత్యక్షంగా చూశాను. రాష్ట్రాభివృద్ధి పట్ల ఆయన నిబద్ధత అసాధారణం” అని ప్రశంసించారు. ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం “ఒక కుటుంబం–ఒక పారిశ్రామికవేత్త” అనే పిలుపునిచ్చిన చంద్రబాబు, ప్రవాసాంధ్రుల కోసం ప్రత్యేక భీమా పథకాన్ని ప్రకటించారు. రూ.10 లక్షల వరకూ భీమా రక్షణ, ప్రసూతి ఖర్చులకు రూ.35 వేల నుండి రూ.50 వేల వరకు ఆర్థిక సాయం, అలాగే న్యాయ సహాయం, లీగల్ కౌన్సిలింగ్ వంటి సౌకర్యాలను అందిస్తామని తెలిపారు. వచ్చే నెల విశాఖలో జరగబోయే భాగస్వామ్య సదస్సుకు యూఏఈ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించిన సీఎం, పెట్టుబడులపై నిరంతర సంప్రదింపులు కొనసాగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పర్యటనలో మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్ధన్ రెడ్డి, ఎన్నార్టీ సొసైటీ చైర్మన్ వేమూరి రవి తదితరులు పాల్గొన్నారు. మొత్తం మీద, చంద్రబాబు యూఏఈ పర్యటన ఏపీకి పెట్టుబడుల దిశగా కొత్త దారిని చూపించింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -