Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో బీఆర్ఎస్‌పైనా, మాజీ మంత్రి హరీశ్‌రావుపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారాన్ని ఎవరికీ శాశ్వతంగా భావించరాదని హెచ్చరిస్తూ..అలా అనుకున్న వారిని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు అని కవిత వ్యాఖ్యానించారు. తాను పార్టీకి ఇరువై ఏళ్ల పాటు సేవలు అందించిన తర్వాత కూడా, కనీసం షోకాజ్ నోటీసు ఇవ్వకుండా అత్యంత అవమానకరంగా సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. .నేనూ తెలంగాణ బిడ్డనే, ఆకలిని భరిస్తాను కానీ అవమానాన్ని తట్టుకోను. అంటూ ఆమె గళం ఎత్తారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో బతుకమ్మ పండుగతో పల్లెపల్లె తిరిగి రాష్ట్ర ఆత్మగౌరవం కోసం కృషి చేశానని గుర్తు చేశారు. అయితే, ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రోటోకాల్ పేరుతో తనను నిజామాబాద్‌కే పరిమితం చేశారని విమర్శించారు. పార్టీలో ఎవరితోనూ నా వ్యక్తిగత విభేదాలు లేవు. కానీ కుటుంబం నుంచే నన్ను బయటకు పంపించారు అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇకపై బీఆర్ఎస్‌తో తనకు ఎలాంటి రాజకీయ సంబంధం ఉండదని స్పష్టం చేస్తూ కేసీఆర్‌ను నేను కేవలం కూతురిగా మాత్రమే కలుస్తాను అని తేల్చిచెప్పారు. మాజీ మంత్రి హరీశ్‌రావుపై కూడా కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రూ.1,100 కోట్ల అంచనాతో ఉన్న పనులను హరీశ్‌రావుకు చెందిన బినామీ కంపెనీకి అప్పగించారని ఆరోపించారు. ఆ తర్వాత ఆ అంచనాను రూ.1,700 కోట్లకు పెంచారని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ ప్రారంభించినప్పటికీ, ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని కవిత ప్రశ్నించారు.
అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపైనా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను ఎత్తిచూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, రెండేళ్లు గడిచినా వాటిలో ఒక్కటీ పరిష్కరించలేదు అని కవిత విమర్శించారు. మెగా డీఎస్సీ వెంటనే నిర్వహించాలని, గ్రూప్ పరీక్షలను పారదర్శకంగా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇటీవల తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సాయం అందించడంలో, ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తన భవిష్యత్ రాజకీయాలపై మాట్లాడుతూ..ప్రస్తుతం నా దృష్టి ప్రజా సమస్యలపైనే ఉంది. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలనే ఉద్దేశం లేదు అని చెప్పారు. అయితే ఎన్నికలకు ఏడాది ముందు తన రాజకీయ యాత్ర తప్పక ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఆడబిడ్డ రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా అని ధైర్యంగా చెప్పారు. రాజకీయ నేపథ్యం లేని మహిళలు కూడా ముందుకు రావాలని, వారికి తగిన అవకాశాలు రావాలని కవిత ఆకాంక్షించారు. కవిత వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీపై విమర్శలు, కుటుంబపరమైన వ్యాఖ్యలు, హరీశ్‌రావుపై ఆరోపణలు అన్నీ కలిపి ఆమె ఈ ప్రకటనతో రాజకీయ వాతావరణాన్ని కుదిపేశాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
