KTR: ఫార్ములా-ఈ కార్ కేసు(Formula-E car case)లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ (Governor Jishnu Dev Varma) అనుమతించిన విషయం తెలిసిందే. దీనిపై కేటీఆర్ స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో భారీ స్థాయిలో భూకుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో పనిచేస్తున్న ఒక ముఠా సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయల విలువ గల భూములను అన్యాయంగా కాజేయడానికి కుట్ర చేస్తోందని ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారాల్లో సీఎం కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విలువైన భూములు ఎక్కడ ఉన్నా అక్కడ రేవంత్ ముఠా పంజా వేసుకుంటోందని విమర్శించారు. ముఖ్యంగా బాలానగర్ పరిసరాల్లో సుమారు 9,300 ఎకరాల భూములపై భారీ అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు.
బాలానగర్, కాటేదాన్ మరియు జీడిమెట్ల ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి తన అనుచరులకు భూములను కేటాయించారని అన్నారు. మొత్తం నాలుగు లక్షల కోట్ల రూపాయలకు పైగా ఈ కుంభకోణం జరిగుతోందని, జపాన్ పర్యటనలో ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ఈ భూములకు సంబంధించిన ఫైళ్లపై ఆదేశాలు జారీ చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. భూముల రాయితీలు ఇవ్వడం ప్రతి ప్రభుత్వ విధానమే అయినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం హైదరాబాద్‌లోనే అతిపెద్ద భూకుంభకోణానికి మార్గం సుగమం చేసిందని మండిపడ్డారు. 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం భూముల రెగ్యులేషన్ కోసం కొత్త చట్టం తీసుకొచ్చిందని, భూములకు వంద శాతం ఫీజులు చెల్లించేలా కఠిన నిబంధనలను అమలు చేసినట్టు కేటీఆర్ గుర్తుచేశారు.
భూములు విక్రయిస్తే రెండు వందల శాతం ఫీజులు చెల్లించేలా నిబంధనలు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పూర్తిగా పక్కన పెట్టి కేవలం 30 శాతం చెల్లిస్తే సరిపోతుందంటూ ఆదేశాలు ఇచ్చిందని అన్నారు. రేవంత్ రెడ్డి తాను ఏ తప్పూ చేయలేదని, లై డిటెక్టర్ పరీక్షకైనా సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ స్పష్టంచేశారు. రేవంత్ రెడ్డి తనను అరెస్టు చేసే ధైర్యం చేయరని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే, కడియం శ్రీహరిని రక్షించేందుకు దానం నాగేందర్ రాజీనామా చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత ముప్పు ఉన్నందున ముందుగానే రాజీనామాలు చేయించే యత్నం జరుగుతోందని తెలిపారు. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు, అనంతరం ఉపఎన్నికలు జరగనున్నాయని కేటీఆర్ అంచనా వేశారు.
